పుట:2015.373190.Athma-Charitramu.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45. "చిత్రకథామంజరి" 405

కృష్ణమూర్తి ప్రథమశాస్త్రపరీక్షలో తప్పెను. అతని చదువు సాములరీతి నా కేమియుఁ దృప్తికరముగ లేదు. 26 వ తేదీని అనంతముగారు బళ్లారినుండి బెజవాడకు వచ్చిరి. మే మందఱము రెయిలుదగ్గఱ వారిని గలసికొని పాఠశాలలో వారికొక విజ్ఞాపనము సమర్పించితిమి. మావిద్యాలయమున నలుగురు ప్రవేశ పరీక్షలో గెలుపొందిరి. తమ్ముఁడు సూర్యనారాయణ యాపరీక్ష నిచ్చెనని విని యానందభరితుఁడ నయితిని.

నా కిపుడు మరల గుండెమంటలు ప్రబల మయ్యెను. నేనే వంట చేసికొనుచువచ్చుటచేత, భోజనసౌకర్యము లేదు. అందువలన నాదేహమున నిస్సత్తువ యేర్పడెను. మాతమ్ముఁడు మద్రాసులో పరీక్ష నిచ్చి రాజమంద్రికి మరలివచ్చుటచేత, నాభార్య 11వ ఫిబ్రవరిని బెజవాడ తిరిగివచ్చెను.

45. "చిత్రకథామంజరి"

నేను దొరతనమువారి కొలువులోఁ జేర నిపు డాశింపఁ జొచ్చితిని! ఫిబ్రవరి 25 వ తేదీని నాకు స్కాటుదొరగారు వ్రాసిన జాబులో, నేను డైరక్టరుగారి కర్ఝీ పెట్టుకొనినచో, తాము చేయవలసినసాయము తాము చేతు మని యుండెను. మఱునాఁడు వీరేశలింగముగారియొద్దనుండికూడ లేఖ వచ్చెను. స్కాటుదొరగారి నాయన చూడఁబోఁగా, రాజమంద్రి కళాశాలలో నొక తాత్కాలికోద్యోగము చేయ నాకు సమ్మతమా యని దొరగా రడిగిరఁట. వెంటనే నే నొకయర్జీ నంపి, నా కీవిషయమున సాయము చేయుఁడని యుభయులను గోరితిని. ఈయూరు విడిచి రాజమంద్రి వెడలి పోవ మాయిద్దఱికి నిష్ట మే.