పుట:2015.373190.Athma-Charitramu.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 402

వివాహసంబంధము దొరక లేదు. వరునికి, ఆస్తిగాని విద్యగాని యంతగ లేవు. యౌవనమున దుర్వృత్తులలోఁ జేరి యాతఁడు తన స్వల్పభూవసతి కొల్లగొట్టెను. భార్యాభర్తలంత స్వగ్రామము విడువ వలసినవా రయిరి. మా పినతండ్రి యనేకగ్రామములలో బడులు నెలకొల్పి, కొన్ని నెల లచటనుండి, తన కచట బాగుగ జరుగుచుండలే దని యసంతృప్తి నొంది, మఱియొక ప్రదేశమున కేగుచుండువాఁడు ! ఇవ్విధమున ననేకగ్రామములు తిరిగినను, ఆయనపరిస్థితు లెంతమాత్రమును జక్కపడలేదు ! అప్పుడప్పుడు వా రిరువురును రాజమంద్రి వచ్చి కొంతకాలము మాతోఁ గడపి, మరల నెచటికైన వెడలిపోవుచుండు వారు.

నేను వారిసాహాయ్యమునకై కొంతకాలము నెలకుఁ గొంచెము సొమ్ము పంపుచుండు వాఁడను. వా రెటులో తమకు లభించిన కొలఁది యాదాయముతో కాలము గడపుకొనుచువచ్చిరి.

ఇటు లుండఁగా, మాచెల్లెలి ప్రసవసమయమున సాయము చేయుటకై మాపినతల్లి రాజమంద్రి వచ్చియుండెను. ఇంకఁ గొలఁది దినములు జీవించి యుండినచో, ఆమె తనభర్తయుండు గ్రామమునకు వెడలిపోయెడిదియే. కాని, యీశ్వరోద్దేశము వేఱుగ నుండెను ! 1901 వ సంవత్సరము జనవరి జనానాపత్రికలో నేను వ్రాసిన "మహలక్ష్మిమరణము" అను వ్యాసము, మాపినతల్లిని గుఱించినదియే. దానిలో నిటు లుండెను : -

'మంచివారికి మరణము ముందు' అను విదేశీయపుసామెతయు, 'సుకృతీ గతాయు:' అను స్వదేశలోకోక్తియు నొక యర్థమునే యిచ్చుచున్నవి. * * *