పుట:2015.373190.Athma-Charitramu.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43. చీకటి వెన్నెలలు ! 399

యొక తెలుఁగువ్యాసము వ్రాసి, ఆనాఁడు జరిగిన ప్రార్థనసమాజసభలో ధర్మోపన్యాసముగ దానిని జదివితిని. అదియే యానెల 'జనానాపత్రిక' లో నొక వ్యాసముగఁ బ్రకటిత మయ్యెను. భారతమందలి "శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహార పంక్తులన్" అను పద్యమును నేను ఉల్లేఖించి యిట్లు వ్రాసితిని : - "తెల్ల వెన్నెల యను మహాసముద్రమున మునింగియున్న పదార్థసమూహమును జూచితిమా, మనస్సు ఆనందపరవశమై, చిత్రచిత్రమగు నూహలకును తలంపులకును జన్మభూమి యగుచుండును ! వెన్నెలరాత్రులందు సముద్రమును జూచి వినోదింపని కన్నులు గన్నులు కావు.

"చంద్రుఁడు వెన్నెలయును లేకుండినచో, భూలోక సౌందర్యమును, మనుజుని సౌఖ్యరాశియును మిగుల కొఱఁతపడియె యుండును ! * * * దేవతలలోని మువ్వురు సుందరాంగులలోను జంద్రుఁ డొకఁడు. ఆతఁడు విష్ణుని యెడమకన్ను, శివునితలపూవు. చంద్రుఁడు కవులకల్పతరువు * * సౌందర్యవతి చంద్రముఖి యగుచున్నది. లావణ్యవతుల నవ్వును వెన్నెలతోఁ బోల్చుచున్నాము. * * వెన్నెలవలెనే యిహలోకసౌఖ్య మస్థిరము. ఎన్నఁడు నస్తమింపని చంద్రుని, నెప్పుడును సమసిపోని చంద్రికను మనము వీక్షింపఁగోరెద మేని, పరమాత్ముఁడను మహాచంద్రునే మనము గాంక్షింపవలెను. ఆ మహామహునియెడ భక్తిప్రేమములు పెంపొందించుకొనుటకే, వెన్నెలవంటి సౌందర్య పదార్థములు మనకుఁ బ్రసాదింపఁబడి యున్నవి !"

పై వ్రాఁతయందలి తుదివాక్యములు పత్రికా వ్యాసమును ధర్మోపన్యాసముగ మార్చివేయుచున్నవి !