పుట:2015.373190.Athma-Charitramu.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40. సమష్టికుటుంబ కష్టములు 385

23 వ అక్టోబరున ఆదిపూడి సోమనాధరావుగారు వచ్చిరి. సంఘ బహిష్కృతులగు నాయనకు మాయింటనే యాతిధ్యమిడితిని. రోజంతయు వారితోనే సంభాషణమున నుంటిని. ఆయన సాయంకాలమందొక చక్కని యుపన్యాస మిచ్చిరి.

28 వ తేదీని దివ్యజ్ఞానప్రచురణము నొకటి చదివి, మూఢత్వ మను గాఢాంధకారమున దివ్యజ్ఞానసామాజికులు చెరలాడుచుండి రని నే నెంచితిని. పశ్చిమఖండవాసుల విజ్ఞానమునకంటె ప్రాగ్దేశీయుల మూఢత్వమే యీ సమాజమువారికి ప్రియతరముగఁ గానవచ్చుచున్నది !

6 వ మేయి ఆదివారము తెల్లవాఱుజామున వైద్యాలయాధికారియగు డాక్టరు వెంకటసుబ్బయ్యగారి జవాను వచ్చి నన్నుఁ బిలిచెను. వారములు చేసికొని మాపాఠశాలలోఁ జదువుచు కాలిబంతి యాటలోఁ గడు నేర్పరియైన పి పులిపాక వెంకయ్య మిగుల జబ్బుగా నుండినట్లు వానివలన విని, నేను వైద్యునింటికేగితిని. పాపము వెంకయ్య వెనువెంటనే మరణించెను ! హృద్రోగమువలన నాతఁ డింత త్వరగ మృత్యువునోటఁ బడెనని వైద్యులు వెంకటసుబ్బయ్యగారి యభిప్రాయము. కొలఁదికాలముక్రిందటనే యాతనికి పెండ్లి యయ్యెను ! వెంకయ్య కిచట బంధువులు లేకుండుటవలన మేమే యాతనిశవమును శ్మశానవాటికకుఁ గొనిపోయి దహనాదిక్రియలు జరిపించితిమి. నిన్నటి వఱకును మందహాసమున బంతులాడెడి యీయువకుఁడు మరణించె ననుట మా కెవరికిని విశ్వసనీయము గాకుండెను! ఆహా ! జీవిత మెంత యస్థిరము !

7 వ మేయి పాఠశాల కీయర్ధసంవత్సరమున తుదిదినము. దాసు గారి కీపాఠశాలతోడిసంబంధ మీనాఁటితోఁ దీఱెను. చివరవఱకును సుగుణదుర్గుణములు మనుజుని వీడకుండునుగదా !