పుట:2015.373190.Athma-Charitramu.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 384

కృతమె కావున, దీనికీర్తి యంతయువారిదె. వీరిశీలమువలెనే, వచనశైలియు, స్వచ్ఛత, మృదుత్వము, బలిమియును దాల్చియున్నది.

మొదటి యాంధ్రకవులవలెనే యీప్రథమాంధ్ర వచనరచయితయు, భాషాంతర గ్రంథరచనముతోనె కాలము గడపవలసి వచ్చెను. అన్యభాషలోఁగల సొంపులను మాతృభాషలోనికిఁ గొనిరావలసిన భార మాయన వహింప వలసివచ్చెను. ఆయన సొంతకావ్యము లల్లుట కిదియె వ్యాఘాత మయ్యెను. ఇదిగాక, బంగాళీసారస్వతమున ప్రథమవచన రచయితలగు రామమోహన విద్యాసాగరులవలె, వీరేశలింగము పంతులు కూడ సంఘసంస్కరణమునకె వచనగ్రంథముల నధికముగ రచియించెను. సత్యమును విస్పష్టముగను, విపులముగను, మోమోటములేకయు నాయనఁ జెప్పవలెను గావున, ఆయన శైలియు స్వచ్ఛముగను స్పష్టముగను సూటిగను నుండెను ! ఇంతియకాదు. ఈ గుణములతోను, సంస్కరణాభిలాషతోడను విలసిల్లెడి వచన శైలిని మనయాంధ్రమునకుఁ గల్పించి కానుకగనొసంగిన కీర్తిని శాశ్వతముగ నీమహామహుఁడు సంపాదించెను !

40. సమష్టికుటుంబ కష్టములు

1900 సంవత్సరము 19 వ వ యేప్రియలున నాకష్టములను దలపోయుచు, ఎచటఁ జూచిన నప్పులు, ఇంటిలోనిపోరు, చెడుతలంపులు, కార్యగతముకాని సంకల్పములు, - ఇవియె నాముఖ్య శోధనములని గుర్తెఱిఁగితిని. 21 వ తేదీని జరిగిన 'నియోగి సహాయక సభ'కు నేనగ్రాసనాధిపతిని. నారెండవ పెదతండ్రికుమారుఁడగు పట్టాభిరామయ్యకు ముప్పదిరూపాయిలు వేతన మపుడీయఁబడెను.