పుట:2015.373190.Athma-Charitramu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. బాల్యము 3

పిన్నిని చిన్ని మేనమామ లిరువురిని జూచి, మా తల్లిని 'అప్ప' యనుచుందును. జ్యేష్ఠుడ నగు నన్నుఁ జూచి, పిమ్మట నా తమ్ములు చెల్లెండ్రును, మా అమ్మను అప్ప యనియు, అమ్మమ్మను అమ్మ యనియును బిలుచుచువచ్చిరి. మా తాతగారు మాత్రము తన వరుసను శాశ్వతముగ గోలుపోకుండుటకుఁ గలసందర్భ మొకింత వివరించెదను. ఒకానొకప్పుడు నేను జదివెడి రేలంగిపాఠాశాలకుఁ బరీక్షాధికారి వచ్చినప్పుడు, నాపేరు జనకునిపేరును పాఠశాలపట్టికలో స్పష్టముగఁ గానఁబడక పోవుటచే, ఆయన నన్నుఁ బిలిచి, "నీపే రేమి ? మా నాన్న పే రేమి ?" అని గ్రుచ్చిగ్రుచ్చి యడిగెను. "నాకు పేరు పెట్టలేదు, మాకుఁ 'వేలివెన్ను నాన్నా', 'రేలంగినాన్నా' ఉన్నారు" అని నేను ప్రత్యుత్తర మిచ్చి, ఆయనసందేహములను మఱింత పెంచివేసితిని ! "ఈ బాలు నింటికిఁ గొనిపోయి సరియైన జవాబు తెప్పించుఁ"డని యా యుద్యోగి యాగ్రహపడఁగా, ఉపాధ్యాయుల యాజ్ఞ చొప్పున చెలికాండ్రు నన్ను మా యింటికిఁ గొనిపోయి, నిజము తెలిసికొని వచ్చిరి. అప్పటినుండియు మా తాతయగు రామన్న గారిని, తండ్రియగు సుబ్బారాయుఁడుగారిని, సరియైన వరుసను నేను బిలువఁజొచ్చితిని. ఇంక నా పేరును గుఱించిన చిక్కు విడఁదీయవలెను. తొలిచూలి పిల్ల వాఁడ నగుటచే బాల్యమున నాకు నామకరణము కాలేదు. తన ప్రియదైవతమగు వెంకటేశ్వరునిపేరును, అప్పటికిఁ గొలఁదికాలము క్రిందటనే కాలగతినొందిన తన పెద్దయన్న పేరును, గలసివచ్చునట్టుగ 'వెంకటాచల'మని, మా యమ్మ నాకుఁ బేరిడ నేర్పఱచుకొనెను. మా తండ్రి కిది యిష్టము లేదు. తన కభీష్టదైవమగు శివుని పేరు నా కాయన పెట్టఁగోరెను. అంత నా కీయుభయదైవముల పేళ్లును గలసి 'వెంకటశివుఁ' డను పేరు వచ్చెను.