పుట:2015.373190.Athma-Charitramu.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 366

సంఘములపక్షమున గంజాము వెంకటరత్నముగారును, రెండవనాఁడు స్థానికసంఘములపక్షమున జంబులింగ మొదల్యారుగారును శాసననిర్మాణ సభాసభ్యు లయిరి. నే నా సభలకుఁ బోయి, "మద్రాసుస్టాండర్డు" పత్రిక ప్రతినిధిగా వార్తల నంపితిని. నా కాదినపత్రిక యుచితముగ వచ్చుచుండెడిది. రెండవనాఁడు యతిరాజులపిళ్లగారి చాయాపట ప్రదర్శనము జరిగెను. అంత 4 గంటలకు పిళ్ల గారి తోఁటవిందు జరిగెను.

నరసాపురోన్నత పాఠశాలకు ప్రథమోపాధ్యాయుఁడు కావలెనని యాదినములలో పత్రికలలోఁ బ్రకటన లుండెను. నే నీపనికి దరఖాస్తుచేసి సాయము చేయుఁడని స్నేహితులను గోరితిని.

మూఁడవ నవంబరున నేను రాజమంద్రి వెళ్లి, తల్లిని తమ్ములను గలసికొంటిని. మా తండ్రిగారి సాంవత్సరికమునకు మా పినతల్లి తప్ప మఱియెవరును రాలేదు. 6 వ తేదీని కర్మలు పూర్తిచేసికొని, నేను బెజవాడ వెడలిపోయితిని. 10 వ తేదీని న్యాయవాదిపరీక్షకు నేను దరఖాస్తు నంపితిని గాని, పరీక్షలో జయమందెదననెడి యాశగాని, జయమందినపిదప న్యాయవాది నయ్యెడికోరిక గాని, నాకు లేదు !

వేలివెన్ను వ్యాజ్యెమునకై నాకుఁ బిలుపు వచ్చుటచేత, 15 వ నవంబరున రెయిలులో నేను తాడేపల్లిగూడెము వెళ్లితిని. నాతోఁ గూడ వీరభద్రరావుగారు వచ్చి రేలంగి వెళ్లిపోయిరి. నేను తణుకు చేరితిని. అచట న్యావాదుల యభిమానమున వాది ప్రతివాదులము రాజీపడితిమి. కొంతసొమ్ము మేము వాది కిచ్చుట కంగీకరించితిమి. నే నంతట రాజమంద్రిమార్గమున బెజవాడ వెడలిపోయితిని. నేను పట్టణమున లేనిదినములలో పురప్రముఖులలో వొకరగు సింగరాజు లింగయ్యపంతులుగారు చనిపోయిరి.