పుట:2015.373190.Athma-Charitramu.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35. నిత్యవిధులు 365

మేము నివసించెడి యింటియజమానియగు గొల్లపూడి శ్రీనివాసరావుగారు కొంతకాలమునుండి నంజువ్యాధిచేఁ బీడింపఁబడి 24 వ సెప్టెంబరున మరణించిరి. ఆయనసతి రూపవతియు గుణవతియు నగు సుదతి. సంతానము లేదు. శవమును శ్మశానవాటికకుఁ గొనిపోవుట కెవరును రాలేదు. అంత రాజారావు వీరభద్రరావు మున్నగు స్నేహితులతోఁ గలసి నేను శవవహనమున సాయము చేసితిని.

27 వ తేదీని రామమోహనరాయల వర్ధంతిని జరిపితిమి. రాయలజీవితమును గుఱించి రాజగోపాలరావు తెలుఁగున వ్యాసము చదివి, తాను రచించిన పద్యపుస్తకములను బంచిపెట్టెను.

దసరా సెలవులకు మేము ఉభయులమును ఏలూరు వెళ్లితిమి. 20 వ అక్టోబరున నచటి పాఠశాలోపాధ్యాయుల తోఁటవిందునకు న న్నాహ్వానించిరి. కామేశ్వరరావుతోఁ గలసి నేను వెళ్లితిని. పురము వెలుపలి జామతోఁటలో కాఫీ మున్నగు ఫలాహారములు గొని, యాటలాడి వినోదించితిమి. మఱునాఁడు నాతోడియల్లుఁడు వెంకటరత్నమును, తరువాతిదినము వల్లూరి సన్న్యాసిరాజుగారును, మిత్రుల కుపాహారము లొసంగిరి. నేస్తులందఱమును గలసికొని ముచ్చట లాడు కొంటిమి. వెంకటరత్నముతోఁ గలసి షికారు పోవునపుడు, తన సంసార సమాచారముల నాతఁడు నాకుఁజెప్పెను. ప్రథమమునఁ గుటుంబ కలహములమూలమున భార్యకుఁ దనకును బొత్తు గలియకుండినను, ఇపుడు సామరస్య మేర్పడెనని యతనివలన విని సంతసించితిని. మే మంత బెజవాడ వెడలిపోయితిమి.

అక్టోబరు 23 - 24 తేదీలందు చట్టనిర్మాణసభలకు ప్రతినిధుల నెన్ను కొనుసభలు బెజవాడలో జరిగెను. మొదటిరోజున పురపాలక