పుట:2015.373190.Athma-Charitramu.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 362

యుండెను. తమ చరిత్రమును నేను వ్రాయుటకు వీరేశలింగముగారు సమ్మతింపకున్నను, నే నీవిషయమున కృషి చేయఁదలంచితిని.

జూలయి 30 వ తేదీని మాపేట పఠనమందిర కార్యదర్శి పని మానుకొనఁగ, ఆ యుద్యోగము నా కిచ్చెద మనిరి. నే నొప్పుకొన లేదు. రాత్రి ఏడున్నరగంటలకు నా కొకతంతి వచ్చెను. రాజమహేంద్రవరమున మాతల్లికి మూర్ఛ లీనాఁడు విడువకుండ వచ్చుచుండుటచేత, నన్ను మా తమ్ముఁడు, వెంటనే రమ్మని కోరెను. కాఁబట్టి నే నారాత్రియె బయలు దేఱితిని. రెయిలులో నాకొన స్నేహితుఁడు కానఁబడి, ధవళేశ్వరమునందలి యొక వైద్యునిచే మాయమ్మకు మందిప్పించుమని చెప్పెను. రేవుస్టీమరులోనే నా కావైద్యుఁడు కానఁబడి, రాజమంద్రిలో దిగినతోడనె నాతో మాయింటికి వచ్చి మా తల్లిని బరీక్షించి వ్యాధినివారణ చేసెదనని పలికెను. వెంకటరామయ్య వృత్తి సంబంధమగు పనిమీఁద నిడదవోలు వెళ్లి, అక్కడనుండి మా వ్యాజ్యెమునకై తణుకు పోయెద నని చెప్పెను. నేను రాజమంద్రిలో నుండి మాయమ్మ కుపచారములు చేసితిని.

మఱునాఁడు వైద్యునికొఱకు ధవళేశ్వరము వెళ్లితిని. నాతల్లికి భార్యకునుగూడ నాయన మందులు నిర్ణయించి చెప్పెను. ఆరాత్రి బండిమీఁద విధిలేక నేను బెజవాడ బయలుదేఱితిని. మాతల్లి యెడ నాకుఁగల ప్రేమాతిశయము నే నెట్లు వెలిపుచ్చఁ గలను ? ఆసంగతి యా పరమాత్మునికే యెఱుక !

ఇపుడు నా "గృహనిర్వాహకత్వము", "హిందూ సుందరీమణుల" ప్రతులు బాగుగ నమ్ముడువడుచు నా కెంతయు నుత్సాహ ప్రమోదములు గలిపించెను.