పుట:2015.373190.Athma-Charitramu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము

పోయి, నేను ఉద్యోగస్థుని తనయు నని చెప్పి, కొంచె మెక్కువగ నాకు వా రిచ్చిన సంభావనను దానే స్వీకరించుచుండువాఁడు ! అజ్ఞానదశలో నిది మఱచిపోయి, బాజాలు చూచినందుకే సామాన్యముగ నేను సంతసించుచుండినను, నా చేతిలోని డబ్బు చెలికాని వశమయ్యె నని యొక్కొకతఱి నిలు సేరువఱకును విలపించుచుందును. రాజమహేంద్రవరమున గుండువారి రేవునందలి పెద్ద టపాలకచేరి మేడమీఁద నొకనాఁడు జరిగిన సంగతి నాకు జ్ఞాపకము. అచ్చటి యుద్యోగీయులనో, మఱి యెవరినో యడిగి, మా తండ్రి యుత్తరము వ్రాసికొనుట కొకసిరాబుడ్డి తెచ్చుకొనెను. తాను వ్రాసిన జాబు మా నాయన చదువుకొనుచుండఁగా, నేను మెల్లఁగ సిరాబుడ్డి తీసి, క్రిందికి దొరలించి, 'టంటమ్మ'ని యది మెట్లమీఁదినుండి జారిపడుచుండఁగ వినోదమునఁ గాంచుచుంటిని ! అది యందుకొనఁబోయి నేనును పడి పోవుదు నని మా తండ్రి నన్నంత చేరఁదీసెను. ఆత్మవినోదమునకై సిరా వ్యర్థము చేయుటకు జీవితమున నిదియే మొదటిసారి యగుటచే గాఁబోలు, నా మనోఫలకమునం దీచిన్నసంగతి చిత్రితమై నేటికిని నిలిచియున్నది.

నా యైదవయేట మా తాతగారు నా కక్షరాభ్యాసము చేసిరి. అప్పటినుండియు నేను బడికిఁ బోయి వచ్చుచుండుట నాకుఁ గొంత జ్ఞప్తి, నా జన్మస్థలమును మాతామహు నివాసస్థానమును నగు వేలివెన్నులోను, పితృనివాసస్థలమగు రేలంగిలోను, నేను సహచరులతోఁ గలసి, పల్లెబడులకును, పాఠాశాలలకును బోవుచుండు దినముల జాడలు నా మనస్సీమ నిప్పటికిని గన్పట్టుచున్నవి. మా తల్లియు పినతల్లియు మేనమామలును, మా మాతామహులను, 'నాన్న' 'అమ్మ' యని సంబోధించుచుండుటచే నేనును వారి నట్టులే పిలుచుచుందును. ఇంతియకాక, మా