పుట:2015.373190.Athma-Charitramu.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33. చెల్లెలి వివాహము 355

33. చెల్లెలి వివాహము

నేనిదివఱకు వ్రాసిన "జీవాత్మ పరమాత్మల" విమర్శనము సరిచూడుఁడని వెంకటరత్నమునాయఁడుగారికి బందరు పంపితిని. ఆయన తది 20 మార్చిని నాకు మరల నంపివేసెను. వారిసూచనల ననుసరించి నే నా వ్యాసమున వలసినకొలఁది మార్పులు చేసి, శుద్ధప్రతి వ్రాసి, 3 వ మార్చిని కలకత్తాకుఁ బంపివేసి, మనస్సునఁ గొంతయుపశమనము గాంచితిని.

బాధపిమ్మట బాధనాకు గలుగుచువచ్చెను. ఇదివఱకు నేనారంభించిన 'హిందూసుందరీమణుల చరిత్రములు' పూర్తియగుచుండెను. న్యాయశాస్త్రపుఁజదువు లొకవిధముగ సాగుచుండెను. నన్నిపుడు వేధించునది కార్యభారము కాదు. నా కప్పిచ్చిన రాజారావు తనసొమ్మీయు మని తొందరచేయసాగెను. అప్పులనుగూర్చి తలంచుటయే నాకు బాధాకరముగ నుండెను. ఎటులో కష్టపడి, ధనసంపాదనము చేసి యప్పులు తీర్చుట పురుషధర్మమని నాకు నచ్చెను. సోదరుల తోడ్పాటున నీఋణశత్రువును సులభముగ నిర్జింపవచ్చునని యెంచితిని. 28 వ తేదీని ఆంధ్రసారస్వత విషయములను గుఱించి వీరభద్రరావుగారితో మాటాడుచు, వీరేశలింగముగారి జీవితచరిత్ర నేను వ్రాసెద నంటిని. "దరిద్రాణాం మనోరథా:"!

5 వ ఏప్రిలున మా పాఠశాలలో ఎడ్డీ యను యువ క్రైస్తవమతప్రచారకుఁడు ఉపన్యాసమిచ్చెను. అతనికి విపరీత క్రైస్తవమతాభి నివేశము గలదు. జ్ఞానవిచక్షణకంటె పట్టుదలయే యాతనియం దధికముగఁ గానిపించెను! ఈ మహనీయుఁడే నాయుఁడుగారు బందరునుండి కదలిపోవుటకు ముఖ్యకారణ మని నాకుఁ దెలి సెను. ఆతని వైఖరియు