పుట:2015.373190.Athma-Charitramu.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 354

యెన్నిటికైన మందు కానవచ్చుచున్నది కాని, విషయ సుఖలాలస కౌషధము గానరాకున్నదే ! నా దేహమన స్తత్త్వములందు, స్థూలసూక్ష్మములు, మంచిచెడుగులును ఎంత విచిత్రముగ మిశ్రితములై యున్నవి !

"గృహనిర్వాహకత్వము" రెండవకూర్పు పుస్తకములు 5 వ మార్చిని నా కందెను. ఆపుస్తకము మాతండ్రిగారికిఁ గృతి యిచ్చి, కొంత మనశ్శాంతి నొందితిని. నాకోరికమీఁద నామిత్రులు కామశాస్త్రులుగారు కృతిపద్యములు రచియించి యిచ్చిరి. ఆ పుస్తకపు ప్రతులు పలువురు కొని చదివిరి. పుస్తకములు అమ్ముడు వోయిన కొలఁది, చేత సొమ్ము చేరి, నాకు ప్రోత్సాహము కలిగెను.

సుఖదు:ఖము లొకటి నొకటి వెంబడించుచుండును. 11 వ మార్చి, తేదీని చెన్నా ప్రగడ సూరయ్యగారు చనిపోయిరను దు:ఖ వార్త వింటిని. ఆయన సత్పురుషుఁడు. కొన్ని సంవత్సరములనుండి పరీక్షలో నపజయ మందుచుండు మిత్రులు కనకరాజు గంగరాజుగార్లు బి. యల్. పరీక్షలో నీమాఱు గెలుపొంది రని విని మిగుల సంతోషమందితిని.

12 వ మార్చిని బెజవాడ రెయిలుస్టేషనుకుఁ బోయి, ప్రయాణము చేయుచుండు వీరేశలింగముగారిని జూచి వారికి భోజన సదుపాయము చేసితిని. ఈ యుదారపురుషునికిఁ జిరాయు వొసఁగు మని దేవదేవుని వేఁడుకొంటిని. మిక్కిలి శ్రమపడి యెట్టకేల కీరోజున, "జీవాత్మ పరమాత్మలను" గూర్చిన నా విమర్శన వ్యాసమును రాత్రి 8 గంటలకు సిద్ధము చేసితిని.