పుట:2015.373190.Athma-Charitramu.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 352

ఇపుడు చేరిన పుస్తకము చదివినకొలఁది నా కాశ్చర్య ప్రమోదము లతిశయించెను. పగ లనక రాత్రి యనక నే నా పుస్తకసారమును గ్రోలితిని. జీవాత్మ మరణావస్థకు లోనుగాకుండుట కింత యమోఘ నిదర్శనము గానవచ్చుటయే న న్నాశ్చర్యమగ్నుని జేసెను.

హాడ్జిసనుగారి యోజనచొప్పున నేను సమాజకార్యదర్శికి లండనునగరము వ్రాసి, అందు సహాయసభ్యుఁడ నైతిని. అప్పటినుండియు నాకు సమాజ ప్రచురణములు క్రమముగ వచ్చుచుండెను. హాడ్జిసను గారి పుస్తక విమర్శనము లనేకములు చదివితిని.

మేము బెజవాడలో నెలకొల్పిన "సంఘసంస్కరణసభ"కు నేను సభ్యునిగ నుండి, రామదాసుగారు పట్టణమున లేకుండుకాలమునం దా సమాజకార్యదర్శి నైతిని. ఆ సమాజమువా రిపుడు హిందూ బాలికా పాఠశాల నొకటి నెలకొల్ప 4 వ ఫిబ్రవరిని తీర్మానము చేసిరి. బెజవాడలో క్రైస్తవ బాలికాపాఠశాల లనేకము లుండెను. క్రైస్తవ విద్యాశాలలో బోధకుఁడనగు నేను వారిసంస్థలకుఁ బోటీగా నుండు విద్యాలయమును స్థాపించు సంఘమున నుంటినేని, మిత్రులు వెంకటరత్నమునాయుఁడుగారివలెనే క్రైస్తవమత సంఘమువారి యనుమానములకు గుఱియై యుద్యోగము గోలుపోవలసివచ్చు నని, నేను సంఘసంస్కరణ సమాజ సభ్యత్వమును విరమించు కొంటిని.

ఆసమయమున మా బెజవాడ పాఠశలలోని యుపాధ్యాయులలో కక్ష లేర్పడెను. ప్రథానోపాధ్యాయుని చర్య లెవ్విధమునను తృప్తికరముగఁ గానఁబడలేదు. కావున సహాయోపాధ్యాయులలో పలువురకు వారియం దిష్టము లేదు. క్రైస్తవ బోధకుఁడగు సాంబమూర్తిగారు బహిరంగముగ నాయనదెస నిరసన చూపుచుండువాఁడు. ఎందును తటస్థభావమున మెలఁగ నా కభ్యాస మయ్యును, సౌజన్య