పుట:2015.373190.Athma-Charitramu.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 348

తేదీని నేను రెయిలెక్కి రాజమంద్రి వెడలిపోయితిని. ఆప్రదేశమున మానాయన సంతోషానన మిపుడు గానరాక నేను మిగుల వగచితిని.

ఆ శీతకాలపు సెలవు రోజులలో నేనును తమ్ముఁడును చెల్లెలు కామేశ్వరమ్మ వివాహ సంబంధమునకు వెదకితిమి. అట్లపాడు సంబంధమే యేర్పాటు చేయఁదలఁచితిమి. దు:ఖాతిరేకమున వగచు మాతల్లికి ననుదినమును భాగవతము చదివి యర్థము చెప్పుచు, ఆమెను గొంత సేదదేర్చితిని. మా మఱఁదల కింకను, దేహస్వాస్థ్యము గలుగనేలేదు. ఐనను నేను భార్యాసమేతముగ 5 వ జనవరిని బెజవాడకు బయలు దేఱిపోయితిని.

మరల ప్రాథమిక పరీక్షలు జనవరి ప్రారంభమున నారంభించుటచేత నే నింత త్వరగ బెజవాడ రావలసివచ్చెను. నా భార్యయు, అత్తగారును బంధువులను జూచివచ్చెద మని యేలూరులో దిగిరి. కావుననే నాయఁడుగారు మున్నగు పరీక్షా స్నేహితులకు, ఇంట రెండవ భాగమున నుండు మిత్రులు వీరభద్రరావుగారే యాతిధ్య మొసంగిరి. నాయఁడుగారి సహాయకులగు దుగ్గిరాల రామమూర్తిగారు మొదలగు మిత్రులు మాయింటనే విడిసియుండిరి.

ఆకాలమునందలి నా శీల విశేషములు తేటపడుటకై, 1899 జనవరి 13 వ తేది సంక్రాంతిపండుగనాఁటి దినచర్య నిచట నుల్లేఖించుచున్నాను : -

"ఈనాఁ డంతయు విషయవాంఛలే నన్ను వేధించినవి! అనగత్యముగనే నేను వానికి లోఁబడుచున్నాఁడను. దేవా, వీనిబాధనుండి నా కెపుడు విముక్తి కలిగించెదవు? నేను కర్మకాండలోఁ జొప్పించి యెంత సలుపుచున్నను, నామనసునకు నయవినయాదిసుగు