పుట:2015.373190.Athma-Charitramu.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31. ప్రాథమిక పరీక్ష 347

నేను 4 వ డిశంబరు తేదీని, బెజవాడనుండి కంకిపాడు బయలుదేఱి, నాయఁడుగారి నచట సాయంకాలము గలసికొంటిని. చెన్నాప్రగడ భానుమూర్తిగారు నిడుగొంది నరసింహముగారును, వారికి సహాయకులుగ నుండిరి. రాత్రి చాలసేపటివఱకును నాయఁడుగారు తమ బందరు వృత్తాంతములు నాకుఁ జెప్పిరి. క్లార్కుదొర తనను నోబిలు కళాశాల విడిచిపొమ్మను సందర్భము వారు సవిస్తరముగఁ దెల్పి, ఆస్తికపాఠశాలా స్థాపనమున కిది యదను గాదని పలికిరి.

ప్రాథమిక పరీక్ష నితర గ్రామములోఁ జేయఁబోవుటకు నాకు సెలవు దొరకుట దుర్లభమయ్యెను. పాఠశాలలోని పని, "జనానాపత్రిక" పని, ఇపుడు పునర్ముద్రణ మగుచుండు "గృహనిర్వాహకత్వము" అచ్చుప్రతులు సవరించు పనియును గలసి, నా కెంతో ప్రయాసము గలిగించెను.

13 వ డిశంబరు విద్యాశాల సంవత్సరపు తుదిదినము. ఆరోజున వేవేగమే పాఠశాలా పరీక్షలు పూర్తి పఱచుకొని, నేను స్టేషనునకు వెళ్లితిని. చెన్న పురికిఁ బోవుచుండెడి కనకరాజు గంగరాజుగార్లను జూచి, నైజాము పోవుబండి యెక్కి, మదిరలో దిగితిని. ఆరాత్రియంతయు నాయఁడుగారు నేనును బండిపయనము చేసి, మఱునాఁటి యుదయమునకు నందిగామ చేరితిమి. రెండు రోజులలో నచటి పరీక్షలు పూర్తిచేసి, జగ్గయ్యపేట వెడలిపోయితిమి. 16 వ డిశెంబరున నచట పరీక్ష జరిగెను. ఇపు డక్కడ పూర్వ మిత్రుఁడు అయ్యగారి సుబ్బారాయఁడుగారు ఉద్యోగమున నుండిరి. వారి యింట నేను బసచేసితిని. బెజవాడయందలి వెనుకటి సౌఖ్య దినములు మా కప్పుడు జ్ఞప్తికి వచ్చెను. మఱునాఁడు బెజవాడ చేరితిమి. 19 వ