పుట:2015.373190.Athma-Charitramu.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. పితృనిర్యాణము 339

నే నంత దు:ఖపరవశుఁడనైతిని. ఈకర్ణకఠోరపుఁబలు కాడిన వైద్యుని దిట్టివైచి, నేను లేచి నిలువఁబడితిని. నా కింతలో, మా తండ్రితోడనే కాక, లోక మంతటితోను సంబంధము వీడిపోయెనను వెఱ్ఱిభ్రమ గలిగెను! బయటికి వెడలిపోవుచున్నా నని చెప్పివేసి, నే నంత వీథినిఁ బడితిని. వర్ణింపరాని గాఢాంధకార మేదియో జగము నావరించునటు లయ్యెను. నా దేహమున గగుర్పాటు గలిగెను. శరీరమనశ్శక్తులన్నియు నొక్కుమ్మడి నుడిఁగిపోవుచున్నట్లు తోఁచెను. స్పృహ దాదాపుగ నంతరించెను. చనిపోవుచుండు మాతండ్రి నంతవదలివేసి, నాభార్యయు మఱికొందఱును నావెంటఁబడి, నన్నుబట్టుకొని, పొరుగున నుండునొక మిత్రుని యిల్లు చేర్చిరి. నా కపుడు శైత్యోపచారములు చేసిరి. అపుడే వారియింటిలో వంట సిద్ధముకాఁగా, నా చేత ముఖము కడిగించి, నాభార్య, నాకుఁ గొంచెము మజ్జిగతోఁ గలిపిన యన్నము పెట్టి, వారివీధిగదిలో నిద్రపుచ్చెనఁట !

నాకు మెలఁకువ వచ్చునప్పటికి, పగలు పదిపదునొక్కగంట యయ్యెను: మానాయన యదివఱకే చనిపోయెను ! తమ్ముఁడు వెంకటరామయ్యయు నావలెనే కొంతసేపు మతి తొలఁగియుండెనఁట నేనపుడు మాయింటికిఁ జని, చనిపోయిన తండ్రికై విలపించితిని. మమ్ముఁ బెంచి పెద్ధవాండ్రను జేసి, విద్యాబుద్ధులు గఱపి సంరక్షించిన ప్రియజనకునికి మే మపుడు, గోదావరినదీసైకత ప్రదేశమున నగ్ని సంస్కారము జరిపితిమి. ఇటీవల నడ్డులేని పోఁకడలు పోవు నాపాపపుహృదయమును గుఱించియే మాకీ ఘోరవిపత్తు సంఘటిల్లె నని నేను విలపించితిని. మాసంసారము నిబిడాంధకారనిమగ్న మయ్యెను!