పుట:2015.373190.Athma-Charitramu.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. హిందూ సుందరీమణులు 333

ఇపు డీ జూలైనుండియు నేను "జనానాపత్రిక"ను పొడిగించిన హేతువున నెక్కువగఁ దెలుఁగున వ్రాయవలసివచ్చెను. వెంటనే పుస్తక రూపమునఁ గొన్ని ప్రతులు తీయుట కనువుగ నుండుగ్రంథ మేదైన నారంభించుట యుక్త మని నాకుఁ దోఁచెను. తాత్కాలికోపయోగమునకై పత్రికలకు వ్యాసములు వ్రాయుట వ్యర్థకాలక్షేపము. అట్టి వ్యాసములు చదువరుల కెపుడు నుపయుక్తమై రుచించునట్టివిగ నుండవు. కావున స్థిరరూపము తాల్చు పుస్తకరచనమునకే నే నిపుడు పూనితిని. ఈ యొకపనిమూలమున, పత్రికాప్రచురణ పుస్తకముద్రణములను రెండుకార్యములు నేను సాధింపవచ్చును.

"జనానాపత్రిక"లో నిదివఱకు స్నేహితులపుస్తకము లీరితిని ప్రచురింపఁబడినవియె. "గృహనిర్వాహకత్వము" అను పుస్తకము నివ్విధముననే నా పత్రికలోఁ బ్రచురించితిని. స్త్రీల కుద్దేశింపఁబడిన పత్రికలో భారతదేశమున నిదివఱకుఁ బ్రసిద్ధినొందిన పుణ్యాంగనలకథ లుండుట సమంజసముగదా. ఈమేయినెల సంచికలోనే "శకుంతల" కథను వ్రాసితిని. ఇపుడు జూలై నుండియు "సీత"చరిత్రమును వ్రాసి ప్రచురించితిని. పిమ్మట 'సావిత్రి' మున్నగు స్త్రీలకథలువ్రాసి, 99 వ సంవత్సరము ఏప్రిలు నెల నాఁటికి "హిందూ సుందరీమణుల చరిత్రముల" మొదటిభాగమును బూర్తిపఱిచితిని. పత్రికలో ముద్రింపఁబడిన యీకథలు, వెనువెంటనే పుస్తకరూపమునఁగూడ బ్రచురింపఁబడెను.

మిగులఁ బరిశ్రమ చేసియే నే నీ పుస్తకములు వ్రాసితిని. అదివఱకే భారత, రామాయణాదులు చదివియుండినను, ఇపు డీకథలకొఱకై ఆయా పుస్తకములు నే నీమాఱు సమగ్రముగఁ జదువవలసివచ్చెను. ఇంతియకాక, ఒక్కొకచరిత్రలోని కథకొఱకు మూఁడునాలుగు పుస్త