పుట:2015.373190.Athma-Charitramu.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 332

మతప్రచారమే ముఖ్యోద్దేశముగఁగల యిట్టివిద్యాలయములలో, నీతి విషయమున మంచిపేరు లేని బోధకుల నియమించెడి యధికారుల నే మనవచ్చును !

నా కాలమున వ్రాఁతపనియం దెంతో యాసక్తి. ఒక్కొకప్పుడు రాత్రి రెండుజాములకే నాకు మెలఁకువవచ్చి పిమ్మట మరల నిద్దుర పట్టకుండెడిది. ఊరక మంచము నంటిపట్టుకొని యుండనొల్లక, నే నంతఁ గలము చేతఁబట్టి, దీపముదగ్గఱఁ గూర్చుండువాఁడను. 'జనానాపత్రిక'కు సంపాదకుఁడ నగుటచేత, ఆపత్రిక కేదో సదా వ్రాయుచుండువాఁడను. 'సత్యసంవర్థనీ', 'ఫెల్లోవర్కరు', 'మద్రాసుస్టాండర్డు' పత్రికలకును, ఆంగ్ల వ్యాసములు వ్రాయుచుండువాఁడను. కాని, వీనియన్నిటికంటె "సంఘసంస్కారిణీ" పత్రికకు వ్రాయుటయందు నాకు మిగుల మక్కువ. నాకుఁ బ్రియములగు సంస్కరణములను గూర్చి నా యిచ్చవచ్చినచొప్పున నింగ్లీషున వ్రాసి, యారచనముల నాపత్రికకుఁ బంపుచుండువాఁడను. ఆపత్రికకు వ్రాయఁ గేలఁగలము పూనఁగనే, ఉత్సాహోద్రేకములు నాకుఁ గలిగి, పొంకమగు పదజాలముతో నొప్పెడి వాక్యములదొంతరలు కాకితముమీఁద దొరలుచుండెడివి ! రానురాను మృదుహాస్యరసయుక్తమగు వ్యాసరచన మాంగ్లమున నా కభ్యాసమయ్యెను. వ్రాయుకొలఁది నాకలమునకుఁ దీవ్రగమనమును లభించెను.

ఒకొక్కప్పుడు, ఆంధ్రరచనముకూడ నా కుత్సాహకరముగ నుండెడిది. కాని, యింగ్లీషునవలెఁ దెలుఁగున వ్రాయునపుడు, సామాన్యముగ నేను స్వతంత్రముగ నాలోచింప నక్కఱలేదు. మాతృక లగు నాంగ్లపుస్తకములు, పత్రికలును నా కీసందర్భములం దాధారములు. వానినుండి భాషాంతరముచేయుటయే తెలుఁగున నా ముఖ్యకార్యము.