పుట:2015.373190.Athma-Charitramu.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 330

లో సంఘసంస్కరణానుమోదమునకును నిట్టి సమ్మేళన మొనఁగూర్చినప్రతిష్ఠ, ఆంధ్రకవిశేఖరుఁడగు వీరేశలింగము పంతులకే ముఖ్యముగఁ జెందవలయును.

"ఆంధ్రజనులు, తమ కిష్ట మున్నను లేకున్నను, వీరేశలింగముపంతుల తలంపులే తలంచుచున్నారు. వారిపలుకులే పలుకుచున్నారు. కొలఁది కాలములో వారికార్యములే యాచరించెద రని మాయాశయము. ఇది భగవదుద్దేశము. లూధరు మహాసంస్కర్తను వెక్కిరించిన సమకాలికి లందఱు సమాధులలోని కెక్కినను, వారిసంతతివారే లూధరునికి స్మారకచిహ్నముగ మహాసౌధనిర్మాణము చేసిరి. వీరేశలింగ వ్యక్తియొక్క యూహలు పలుకులు పదములును శక్తిమంతము లైనను, ఆయనక్రియలే మనకు ముఖ్యములు మనము ధన్యులము కాఁగోరితిమేని, యా మహాశయుని బోధనలు విని, పలుకులు మననముచేసి, కార్యముల ననుకరింపవలయును"

28. "హిందూసుందరీమణులు"

1898 వ సంవత్సరము మార్చి 22 వ తేదీ శనివారము నేను 4, 5 తరగతుల విద్యార్థులకు పరీక్షలు చేసితిని. ఒకపిల్ల వాఁడు ప్రశ్నకాకితముల కుత్తరువులు వ్రాయుచున్న వానివలె నటించి, పరీక్షా సమయమున నేదో పుస్తకపుఁ బుటలు తిరుగవేయుచుండెను. నే నట్టె చూడఁగ, అది "కళాశాస్త్రము"! నే నా పుస్తకమును దీసికొని, ఈ సంగతిని విచారించి విద్యార్ధినిఁ దగినట్టుగ శిక్షింపుఁ డని యచట నిలుచుండిన ప్రథమోపాధ్యాయునిఁ గోరితిని. ఆ పిల్ల వానినిగుఱించి మిగుల విషాదమందితిని. విద్యార్థులకు నీతిబోధనము చేయుట కొక సమాజ ముండుట యావశ్యకమని తలంచితిని.