పుట:2015.373190.Athma-Charitramu.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 328

వలసిన ముఖ్యలక్షణములు, దీనికి లేకపోలేదు. ముందలి సంపుటముల యందు పాఠకులకు రుచి కలిగించుటకోయన, ఈ గ్రంథమున మతికెక్కిన పంతులుగారి ప్రహసనములు ముద్రితమయ్యెను. గ్రంథకర్తకు స్థిరకీర్తినాపాదించిన వారి హాస్యరసయుక్తసంభాషణా ప్రహసనము లిందుఁ గలవు. 'శకునములు' 'మూఢభార్య - మంచిమగఁడు' - 'ఆచారము', 'పెళ్లి వెళ్లినతరువాత పెద్దపెళ్లి', 'బాలభార్య - వృద్ధబర్తృ సంవాదము', 'హిందూమతసభ,' మున్నగు నీచిన్న చిన్న ప్రహసనముల చవిగాంచనివా రెవరు గలరు? ప్రకృతాంధ్రవచనమునకువలెనే, ప్రహసనరచనమునకును వీరేశలింగకవియే సృష్టికర్త ! ఇందలి హాస్యసంభాషణముల కీయన యిచ్చిన "హాస్యసంజీవని" యను పేరే తెలుఁగునప్రహసనమునకుఁ బర్యాయపద మయ్యెను. బాలవృద్ధులకును పండిత పామరులకును, - ఎల్లరికి నీరచనలు 'కరకర మని' రుచికరముగ నున్న యవి!

"ఈ ప్రహసనము లన్నియు గత 25 సంవత్సరములలో వ్రాయఁబడినవి. ఇవి బాలురు చదివి వినోదింతురు. పెద్దవారు గ్రహించి మెచ్చుకొందురు. సంఘసంస్కరణవిషయములనుగూర్చి యిందు చర్చలు గలవు. ఈ సంస్కర్తకు సంఘముతోడి సంరంభ మారంభమయినపుడు, మనలోఁ బలువురు చిన్న వారలుగ నుండిరి; కొందఱు జననమే కాలేదు. సంస్కారవిముఖమగు సంఘముతో నీవీరుఁ డొంటరిగ సమరము సాగించిన వీరి పూర్వకాలపుటపార పరిశ్రమమును, సభలు చర్చలు ప్రసంగములును ప్రబలినయీప్రశాంతసమయమున మనము సమగ్రముగ గ్రహింపక నేరక పోవచ్చును. ఆకాలమున ప్రసంగములును బహిరంగసభలును నిషిద్ధములు ! దుర్నీతి, వ్యభిచారము, మూఢవిశ్వాసములును గౌరవాస్పదమైన యాకాలమున నీశూరుఁడు దౌష్ట్యమును ఖండించి