పుట:2015.373190.Athma-Charitramu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. ప్రహసన విమర్శనము 325

యని చూప రనుకొనిరి. మా తలిదండ్రులు సాయంకాలమునకు రాజమంద్రి వెడలిపోయిరి. నేను, సోదరులు, మిత్రులును ఆదినమున ధవళేశ్వరములో నిలిచి, ఆనకట్ట మున్నగు దృశ్యములు చూచి వచ్చితిమి. మఱునాఁటి ప్రొద్దున పెండ్లివా రందఱిని రాజమంద్రియందలి మా యింటికి గృహప్రవేశమునకుఁ గొనివచ్చితిమి.

18 వ జూను సాయంకాలమున పురమందిరమున ప్రత్యేక ప్రార్థనసమాజసభ యొకటి జరిగెను. "సత్యసంవర్థనీ"పత్రిక యిఁక ముందు నా యాజమాన్యమున బెజవాడలో ముద్రణమై, రాజమంద్రిలో ప్రచురింపఁబడునట్టుగ తీర్మానమయ్యెను !

అంత మేము బెజవాడ వెడలిపోవలసిన తరుణము వచ్చెను. నాభార్య మాతో రాలేకపోయెను. అందువలన, నాకును చిన్న తమ్ముఁడు సూర్యనారాయణకును బెజవాడలో భోజనసౌకర్య మొనఁగూర్చుటకై, మా చిన్నప్ప మాతో వచ్చెను. 20 వ తేదీని మేము బెజవాడ చేరి, వీరభద్రరావుగారిని గలసికొంటిమి. తన చిన్నకుమారుఁ డిటీవల చనిపోవుటచేత, ఆయన దు:ఖతోయములఁ దోఁగియుండిరి.

27. ప్రహసన విమర్శనము

మరల బెజవాడపాఠశాలలోఁ జేరి నా కార్యక్రమమును జరుపుకొను చుంటిని. ప్రార్థనసమాజసభలు నితరసంస్థలును యథాప్రకారముగనేసాగుచుండెను. జూన్ 26 వ తేదీని జరిగిన ప్రార్థనసభలో నేను భాగవతమునుండి కొన్ని పద్యములు చదివి, వాని సారమునుగూర్చి ప్రసంగించితిని. ప్రార్థనసమయమున తమ్ముఁడు సూర్యనారాయణను సద్దు చేయవలదని వారించితిని. ఆరోజునసాయంకాలమునందు ప్రాఁత