పుట:2015.373190.Athma-Charitramu.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 324

నేను బ్రత్యుత్తర మిచ్చుచు, విద్యాధికులలోఁ గొందఱు సంకుచితభావమున సంస్కరణవిషయమై యామెకుఁ దెలిపెడి సంగతు లామె విశ్వసింపఁగూడ దని వ్రాసివేసితిని ! పత్రికలోని మార్పునకు దొరతనమువా రంతట సమ్మతించిరి.

నేను రాజమంద్రిలో నుండు దినములలోఁ దఱచుగ పురమందిరము పోయి, పత్రికలు చదువుచుండువాఁడను. "ఇంగ్లీషువారి సంసారపద్ధతులు" అను శీర్షికతో నొక యాంగ్లస్త్రీ వ్రాసిన వ్యాసములు హృద్యములుగ నుండెను.

నే నెచట నుండినను, నాకు పత్రికావ్యాసరచనమునుండి మాత్రము విరామము లేకుండెను ! ఆనెల జనానాపత్రికకు వ్యాసములు వ్రాయుచు, నేను తమ్ముఁడును జూన్ 8 వ తేది యంతయుఁ గడపితిమి. మఱునాఁడు మద్రాసునందలి "ఫెలోవర్కరు" పత్రిక కొక చిన్న యాంగ్లవ్యాసము వ్రాసి పంపితిని.

మా తమ్ముఁడు కృష్ణమూర్తి కిపుడు వచ్చిన యొకటి రెందు సంబంధములకు మే మంగీకరింప లేదు. మేయి 30 వ తేదీని మా నాయనయు, కృష్ణయ్యయును వివాహసంబంధ నిశ్చయమునకై కాళ్ళ గ్రామము వెళ్లి, నాల్గవ జూనుతేదీని రాజమంద్రి తిరిగివచ్చిరి. అచటి సంబంధమే తమకు నచ్చె ననియును, పెండ్లి 9 రోజులలో జరుగు ననియును వారు చెప్పిరి. 12 వ జూనున మే మందఱము బండ్లమీఁద ధవళేశ్వరము వెళ్లి, అచ్చట మాతోడియల్లుడు పోడూరి కృష్ణమూర్తి గారియింట బస చేసితిమి. పెండ్లి కూఁతునివారు సత్రములో దిగిరి జనార్దనస్వామి యాలయములో ప్రాత:కాలముననే వివాహము జరిగెను. పెండ్లికూఁతుని కను లొకించుక తెలుపైనను సౌందర్యవతియె