పుట:2015.373190.Athma-Charitramu.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. ఇంటితగవులు, మండల సభలు 319

భార్యయు, సుబ్బారాయఁడుగారి పత్నియును. విశాలక్షమ్మ రెండవ కక్షిదారురాలు. పెద్దలకు చిన్నలకును ఆశయములందును, అభిప్రాయములందును భేదము లుండుట స్వాభావికము. చిన్నవార లిరువురును సతతము తనమీఁద చాడీలు చెప్పుకొనుచుందురని విశాలక్షమ్మయులుకు! "కలహకంఠీ!"యని యా పెద్దముత్తయిదువ వెంకమ్మగారి ననుచుండఁగ చెవులఁబడి నే నొక నాఁడు నవ్వుకొంటిని. సుబ్బారాయఁడుగారి భార్య వెంకమ్మగారికిఁ జదువు రాదు. "చూచితివమ్మా! నన్ను 'కలాలకంటీ' అని యీముసలవ్వ తిట్టుచున్నది" అని వెంకమ్మగారు రత్నమ్మగారితో ఫిర్యాదు ! అంత చిన్న లిద్దఱును సమ్మెకట్టి, ముసలమ్మతో మాటాడ మానివేసిరి.

చిన్నమ్మలను జూచి పెద్దమ్మ సదా మోము ముడుఁచుకొని యుండెడిది !

ఆఁడువారి మనస్పర్థలు మెల్ల మెల్లగ మగవారల కెగఁబ్రాఁకెను! శాస్త్రిగారిని ఏలూరునుండి రప్పించి, వారికా పాఠశాలలో నుపాధ్యాయునిపని నేనె యిప్పించితిని. మా కిరువురకును స్నేహమే. ఇరువురికిని మిత్రు లొకబృందమువారే. అద్దెలో చాలభాగము నేనె యిచ్చుచుండువాఁడను. స్త్రీలవైరము లడఁచుట యసాధ్య మని నేనిపుడు గ్రహించి, తా మింకొకయిల్లు చూచుకొనెదరా యని నేను శాస్త్రి నొకనాఁ డడిగితిని. దీని కాయన కోపించి, తాను గదల ననియు, వలసినచో నేనె యిల్లు విడిచిపోవచ్చు ననియును జెప్పివేసి, న న్నాశ్చర్యమున ముంచిరి ! ఈయింటికే కాదు, ఊరికిని ఉద్యోగమునకును నా యాహ్వానముమీఁదనే వచ్చినశాస్త్రి నా కీజవా బిచ్చుటకు నేను జిఱచిఱలాడితిని !