పుట:2015.373190.Athma-Charitramu.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 316

ననెడియాశ నామనస్సున నణఁగిపోవుచున్నది. ఎంతకాలము నేను సంఘమువారి భయముచే నిట్లు కృంగిపోవలెను ? నేను బ్రాహ్మసామాజికుఁడనై, భగవత్సేవ చేయుచు, అంతరాత్మయాదేశములచొప్పున జీవితము నడపుకొనవలె నని నాయుత్కృష్టాశయము. దీనికిఁబ్రబల విఘాతము గలుగుచున్నది!"

19 వ ఏప్రిలున వెంకటరామయ్య బెజవాడ వచ్చెను. భార్య పోయిన నెలలోనే తమ్మునికిఁ బెండ్లి తల పెట్టితివేమని నేను వానిని జీవట్లు పెట్టినను, పెద్దవారల నిర్ధారణమునకు పిన్న వారలను నిందించుట న్యాయము కాదని నేను గ్రహించి, పిమ్మట విచారించితిని. నా కోరికమీఁద వెంకటరామయ్య తాను బెజవాడ వచ్చి యిచటనే న్యాయవాదిగ నుందు నని చెప్పెను. 26 వ తేదీని అతఁడు రాజమంద్రి వెడలిపోయిను.

కొన్నిదినములకు నా కీ క్రిందియుత్తరము మా తండ్రిగారి యొద్దనుండి వచ్చెను.

"శ్రీరాములు. చిరంజీవులయిన మాకుమాళ్లు రాయసం వెంకటశివుడును సుబ్బారాయుడు చిరాయువులుగాను దీవిస్తిమి -

"వెంకట్రామయ్యవల్ల అంన్ని సంగతులున్ను తెలిశ్నివి. కృష్ణయ్యవివాహమునుగురించి యిదివర్కు 10 15 సంబంధములు వచ్చినవి. మనకు అనుకూలం లేనివారితో ప్రస్తుతం తలంపులేదని చెప్పినాము. కొంన్ని సంబంధములు తిర్గిపోయి మరివకర్కి ఏర్పర్చు కుంన్నారు. రెండుమూడు రోజులకిందట తాంన్యాడ గంగరాజు గారివద్దనుంచ్చి వకసంబంధం రాబడినది. వారు చాలా మర్యాదస్తులు. పిల్ల 11 సంవత్సరములు కలదై బహు మంచిదనింన్ని, ముఖ్యంగా