పుట:2015.373190.Athma-Charitramu.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 310

సంవత్సరారంభము నా కెంతయు నశుభప్రదముగ నున్నది. మరణ మొకటియే నా బాధానివారణము చేయఁగలుగు నని తోఁచుచున్నది ! దేవుని యాస్తిక్యమునందు నాకు నమ్మిక తొలఁగలేదు గాని, పరమాత్మునిమహిమ మేమియు నాయాత్మలో ప్రతిఫలన మగుట లేదు !"

నేనీ సంవత్సరము చేయవలసిన కార్యములు రెండు గలవు. ఒకటి న్యాయశాస్త్రసంబంధమగు చదువు. రెండవది, నూతనవార్తా పత్రికాప్రకటనము. ఇదియును, పాఠశాలలోనిపనియు, "జనానా" "సత్యసంవర్థనీ" పత్రికాసంపాదకత్వమును గలసి నాకు దుర్భరభారముగఁ దోఁచెను !

జనవరినెలలో బెజవాడలో విశూచి ప్రబలియుండెను. మాయింట నొకభాగమున నుండు శ్రీఅయ్యగారి సుబ్బారాయఁడు గారి జవాను సుబ్బయ్యకు 8 వ తేదీని ఈవ్యాధి సోఁకెను. అంత వానిని వైద్యాలయమునకుఁ గొనిపోయితిమి. అక్కడ వాఁడా రాత్రి చనిపోయెను. చందావేసి వానికి దహనాదికర్మలు జరిపించితిమి.

కాబెట్టు విరచితమగు "యువజనహితోపదేశము" అను నాంగ్ల పుస్తకము నే నిపు డెంతో తమకమునఁ జదివితిని. ఈరీతి నాంధ్రమున గ్రంథరచన చేయ నే నభిలషించితిని. కాని, స్వానుభవమున నిన్ని యంశములు నా కెట్లు సమకూరఁగలవు ? నా యనుభవ మసమగ్రము, భావవిస్ఫురణము సంకుచితమును ! ముందైన సుఖదినములు గాంచ నోఁచితినా యని నేను బలవించితిని.

సతి కాంగ్లము బోధింప నే నాసక్తితో నుంటిని. కాని, యామెకుఁ జదువునం దిష్టములేదు. విద్యావతులగోష్ఠికంటె నజ్ఞాన స్త్రీల సహవాసమే యామె కభిమతము !