పుట:2015.373190.Athma-Charitramu.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21. ఆశాభంగము 305

సంస్కరణ సమాజము" వారి విడిదికిఁ బోవుచుండువాఁడను. నన్ను వారు సభ్యునిగఁ జేర్చుకొనిరి. సభికులు వారమున కొక్కమాఱు తమబసలో సమావేశమై, తమలో సౌభ్రాతృత్వమును బెంపొందించు కొనుటకై యందఱును గలసి ఫలాహారములు చేయుచుండువారు. ఇది నా కంతగ తృప్తికరముగ లేదు.

నేను చెన్నపురికి వచ్చినపిమ్మట, "లండను నగర రహస్యములు" మున్నగు ననేకపుస్తకములు చదివితిని. కాని, నేనిచ్చటికి వచ్చిన ముఖ్యకార్యమె మఱచిపోయితినికదా ! ఎన్ని కష్టములు పడియైనను, ఇచట రెండుమూఁడు సంవత్సరము లుండి, యం. యే. పరీక్షకుఁ జదివి యందు జయ మందినచో, ఏకళాశాలలోనైనను నాకు మంచి యుద్యోగము లభింపఁగలదు. లేనిచో, బి. యల్. పరీక్షకైనను నేను మెల్ల మెల్లగఁ జదివి కృతార్థుఁడనైన బాగుండునని మా తలిదండ్రుల తలంపు. కాని, యీ పాఠశాలలో దినమున కాఱుగంటలు నేను పని చేయవలసివచ్చెను. ఇదిగాక, ప్రథమోపాధ్యాయుఁడ నగుటచేత, నాబాధ్యత యధికముగ నుండెను. పాఠశాలకు సొమ్ము చాలదు. బోధకుల కందఱికి నెలలకొలఁది జీతములు ముట్టుట లేదు ! ఇటువంటి విద్యాలయమున నే నెటులుండి యుద్ధరింపఁగలను ? ఈ పాఠశాలకుఁ జేరువనుండెడి "తిరువళిక్కేణియున్నత పాఠశాల"తో సరిసమాన మైన మంచిపేరు దీనికిని గొనిరావలదా యని సుబ్రహ్మణ్యయ్యరు గారితో నే నొకనాఁ డనఁగా, "మన పాఠశాల వేఱొకవిద్యాలయముతో పోటీ చేయ నక్కఱలేదు. మంచి విద్యార్థులు ఇతరపాఠశాలల కేగినను, మిగిలిన తక్కువరకపు బాలురే మనకుఁ జాలు" నని ఆయన చెప్పివేసిరి ! ఇంకొకసారి, ఇచటి యుపాధ్యాయులకు నెల నెలకును సరిగా జీతములు లభింపకుండుట చింతనీయ మని నే ననఁగా,