పుట:2015.373190.Athma-Charitramu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20. చెన్నపురి యుద్యోగము 297

పోయితిని. అచట నాతలిదండ్రులు సోదరులును సేమముగనే యుండిరి. నా దరఖాస్తు చెన్నపురి కనుపఁబడెనని నాకుఁ దెలిసెను. తన కళాశాలకు, అనుభవశాలియును సంస్కృతజ్ఞానము గలవాఁడును నగు బోధకుఁడు గావలెనని దొర కోరెనఁట. అందువలన నాకు లాభము గలుఁగ దని నేను గ్రహించితిని. ఈవిషయమై నాపూర్వ గురువులగు స్కాటుదొరగారికి మద్రాసు తంతి నంపి, నన్నుగుఱించి డైరక్టరుగారికి సిఫారసు చేయుఁ డని నేను గోరితిని.

మే మిదివఱకు బెజవాడలో బసచేసియుండిన గోవిందరాజుల వారి యిల్లు జూలై 27 వ తేదీని మేము వదలి పోవలసివచ్చెను. వారి పెరటిలో మేము పెట్టిన చెట్లపాదులకు తుమ్మమండలు కొన్ని తెప్పించి నేను పాతించినందుకై, ఇంటియజమానుఁడగు సుబ్బారాయఁడుగారికి నామీఁద గోపము వచ్చెను.

ఆపేటలోనే కొంచెము దూరమున వేఱుగా నుండు నొక బంగాళాను నెల కెనిమిది రూపాయిల యద్దెమీఁద పుచ్చుకొని మే మచటికిఁ బోయితిమి. ఈక్రొత్తయింటి చుట్టును విశాలమగు పెరడు గలదు. కాని, చుట్టుపట్టుల దగ్గఱగ నిం డ్లేమియు లేకపోవుటవలన, నొంటరిగ మే మచట నుండుటకు మొదట కష్టముగ నుండెను. మాపాఠశాలలో చిత్రలేఖనా బోధకుఁడును నా స్నేహితుఁడునగు రామస్వామి శాస్త్రులుగారు వారి తల్లియును వచ్చి, జులై నెలాఖరున మా యింట నొక భాగమున దిగుటచేత, మాకు ధైర్యముగ నుండెను.

ఒకరాత్రి సంభాషణసందర్భమున, "చెన్నపురి ఆర్యపాఠశాల"లో ప్రథమోపాధ్యాయపదవి ఖాళీ యయ్యె ననియు, వారి కాంధ్రోపాధ్యాయుఁడు గావలెననియును శాస్త్రిగారు చెప్పిరి.