పుట:2015.373190.Athma-Charitramu.pdf/311

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

14. ప్రాఁతక్రొత్తలు 271

రణ సమాజమును నెలకొల్పి కార్యసాధనముఁ జేయవలెనని నేను సంకల్పించుకొంటిని.

స్నేహితుఁడు రామమూర్తి 1896 వ సంవత్సరారంభమున బెజవాడ విడిచి పోయి, బందరు నోబిలుకశాశాలలో నుపాధ్యాయుఁ డయ్యెను. కావున కామశాస్త్రి, రాజారావు, రామస్వామిశాస్త్రిగార్లు మున్నగు మిత్రులతోఁ గలసి, నే నీకాలమునఁ బ్రొద్దుపుచ్చుచుండువాఁడను. "సత్యసంవర్థని"కి దఱచుగ వ్రాయుచు, "జనానాపత్రికను" బ్రచురించుటయే కాక, మద్రాసునందలి "స్టాండర్డు" పత్రికకుఁను, "సంఘసంస్కారి" పత్రికకును, ఆంగ్ల వ్యాసములు లిఖించుచును వచ్చితిని.

ఈ 1896 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో మిత్రుఁడు మృత్యుంజయరావు క్షయరోగపీడితుఁడై తుదకు మృత్యువువాతఁ బడుటకు నే నెంతయు వగచితిని. అతనిని గుఱించి "సంఘ సంస్కారిణీ" పత్రికలో నొక వ్యాసము వ్రాసి, కళాశాలదినములలో ప్రార్థన సమాజమునకును, సత్యసంవర్థనీ పత్రికవిషయమునను, అతఁడు చేసినకృషి నభినందించి, వితంతూద్వాహములఁ బ్రోత్సహించిన సంఘసంస్కారి యనియు, నిక్కమగు దైవభక్తుఁ డనియు నాతనిని బ్రశంసించితిని. రాజమంద్రిలో "ఆస్తికపాఠశాల" నెలకొల్పసమకట్టిన సుజనుఁ డనియు, అతని మృత్యువువలన మా సమాజమునకే కాక, ఆంధ్రావని కంతకును తీఱనికొఱఁత వాటిల్లె ననియు నేను వక్కాణించితిని.

శరీరదార్ఢ్యములేని నాకును అతనికివలెనే యకాలమరణము సంభవించి, మాకుటుంబమును మితిమీఱిన కష్టములపాలు చేయవచ్చునని భీతిల్లి, అట్టిపరిస్థితులలో సతికి జననికిని గొంత జీవనోపాధిఁ గలిగింప విధ్యుక్తమని యెంచి, నేను ఈసంవత్సరము ఏప్రిలునెలలో