పుట:2015.373190.Athma-Charitramu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 264

వ్రాసిన చిన్న పుస్తకము నారచనకు మాతృక, అప్పటినుండియు నెల నెలయును నేనా పుస్తక ప్రకరణములను జనానాపత్రికలోఁ బ్రకటించుచుంటిని. కమలాంబచరిత్ర తర్జుమా బాగుగ లేదని వెంకటరత్నముగారు చెప్పుటచేత నేనా పుస్తకమును మరల తెలుఁగు చేసితిని. 11 వ ఆగష్టు ఆదివారమురోజున రామమూర్తియు, నేనును, బెజవాడలో "ప్రార్థనసమాజ" స్థాపనముఁ జేసితిమి. నేను ప్రార్థన సలిపి, దైవభక్తిని గుఱించి ప్రసంగించితిని. నామిత్రుఁడు సమాజోద్దేశముల విషయమై యుపన్యాస మొసంగెను.

ఆకాలమున చెన్నపురి రాజధానిలోని ఆంధ్రమండలముల ప్రతినిధులు శాసననిర్మాణ సమాజసభ్యుల నేర్పఱుచుటకై బెజవాడలోఁ గూడుచువచ్చిరి. ఈమాఱు 15 వ ఆగష్టున నీ సభ బెజవాడలో జరిగెను. పురపాలక సంఘముల పక్షమున శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగా రెన్నుకొనఁబడిరి. ఇది మా కందఱకును సంతోషకరముగ నుండెను.

ఈ సంవత్సరపు పరీక్షాఫలితములైన బాగుగలేనిచో, తానీ పాఠశాల వదలివేయుదు నని అనంతముగారు చెప్పివేసిరి. అందువలన నా కెంతో యలజడి గలిగెను. నేనిపుడు ప్రథమసహాయోపాధ్యాయుఁడనై, ఆటలు పాఠక్రమపట్టిక మున్నగు పనులయం దాయనకుఁ దోడ్పడుచుండుటచేత, నా కాయన పలుకులు కొంత భీతిని జనింపఁ జేసెను. పాఠశాలాభివృద్ధికొఱ కెంతో పాటుపడితిమి.

16 వ ఆగష్టున మాపెద్దపెత్తండ్రి చనిపోయె నని తెలిసి తమ్ముఁడు నేనును మిగుల విషాదమందితిని. 22 వ ఆగష్టున బాలికా పాఠశాలాధికారిణి యగు బ్రాండరుదొరసాని దగ్గఱనుండి నా కొక