పుట:2015.373190.Athma-Charitramu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 262

మీఁద గోదావరి దాటి, కొవ్వూరునొద్ద రెయిలెక్కి, బెజవాడ చేరితిమి. అనంతముగారిని, స్టేషనునొద్ద మేము చూచితిమి.

జూను 20 వ తేదీని పుస్తకములు సరదికొని, మిత్రులను సందర్శించి వచ్చితిని. విద్యార్థు లనేకులు నన్నుఁ జూడవచ్చిరి. బెజవాడ మకాముచేసియుండు మన్నవ బుచ్చయ్యపంతులుగా రిపుడు నాకుఁ గానఁబడిరి. నే నిచటనె యింక రెండు సంవత్సరము లుందు నని క్లార్కుదొరకు వ్రాయనా యని అనంతముగారితో నేననఁగా, అది తమకు సమ్మతమె యైనను, దొరకు వ్రాయుట సమంజసము గాదనియు, సమయము చూచి తామె యీసంగతి వారికిఁ దెలియఁజేతు మనియు వారు చెప్పిరి.

ఈ జులై నెలనుండియు, "జనానాపత్రిక" నాయొక్కని యాధిపత్యముననె ప్రచురింపఁబడుచుండెను. గతసంవత్సరమున నాకోరిక చొప్పున వెంకటరత్నముగారు తోడిపత్రికాధిపతులుగ నుండి సాయము చేసిరి. తమ కిఁకఁ దీఱదని వారు చెప్పివయఁగా, పత్రికా నిర్వహణభారము నేను వహింపవలసివచ్చెను. అంతటినుండి "జనానాపత్రిక"ను గూర్చిన పనులన్నియు నామీఁదనె పడెను. పాఠశాలలో విద్యాబోధనమును, ఇంటఁ బరీక్షాగ్రంథపఠనము, పత్రికానిర్వహణమును జేయవలసివచ్చి, తీఱిక లేక నేను తల్లడిల్లితిని. పనులు బాగుగ నెరవేర్పకుండెననియు, పాఠములు సక్రమముగఁ జదువుచుండలే దనియును నేను భార్యను సదా తప్పుపట్టుచు, నావాక్కున నిట్లు మార్దవము లేకుండఁజేసిన విధిని దూరుచు, లోనఁ బరితపించుచు, దినములు గడుపుచుండువాఁడను !