పుట:2015.373190.Athma-Charitramu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈపుస్తకమును దమ యమూల్యగ్రంథమాల కొకనూతన కుసుమముగఁ గైకొని, దీనికిఁ దొలిపలుకు వ్రాసి, నన్ను గౌరవించిన శ్రీ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుపంతులుగారికి నాకృతజ్ఞతాపూర్వక నమస్కృతులు సమర్పించుచున్నాను. ఈపుస్తకముద్రణము నందు నాకు వలసిన సౌకర్యము లొనఁగూర్చిన ఆంధ్రపత్రికా ముద్రాక్షరశాలవారికి వందనము లర్పించుచున్నాను.

ఈపుస్తకము వ్రాయునపుడు నాకుఁ గలిగిన పెక్కు సందియములను నివారణముచేసి, మంచిసూచనలు చేసిన నా పూర్వశిష్యులు మిత్రులునగు శ్రీకొలచెలమ కృష్ణసోమయాజులు గారికిని, అక్కడక్కడ కొన్ని మంచిమార్పులు సూచించిన శ్రీయుత చన్నాప్రెగడ భానుమూర్తిగారికిని వందనము లర్పించుచున్నాను.

ఇందులోఁ జేర్చినపట్టికలో తప్పొప్పులలో ముఖ్యములగునవి కొన్ని చూపింపఁబడినవి.

పుస్తకమందలి కథ వేవేగముగ సాగిపోవుటకు ప్రతిబంధకములును, సామాన్యపాఠకుల కంతగ రుచింపక యనగత్యముగఁ దోఁచునవియునగు కొన్ని విషయములు పుస్తకముచివరను అనుబంధ రూపమునఁ దెలుపఁబడినవి.

పాఠకమహాశయు లీగ్రంథమందలి లోపములు క్షమింపవలెనని వేఁడుచున్నాను. ఈపుస్తకపఠనమువలన నెవరి కేమాత్రము లాభము చేకూరినను, నే నమితానంద మందెదను; ఎవరిమనస్సునకు నొప్పికలిగెనను, మిక్కిలి విచారమందెదను.

రాయసం వెంకటశివుఁడు.

జూను, 1933.