పుట:2015.373190.Athma-Charitramu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 254

కుటుంబఋణము పెరుఁగుచుండుటచేత, అది తీర్చివేయు నుద్దేశమున మాభూము లమ్మఁజూపుటకై తండ్రియు నేనును గోటేరు మున్నగు ప్రదేశముల కపుడు ప్రయాణమైతిమి. ఈపద్ధతి మాతల్లికి సమ్మతముగ లేదు. ఈ సందర్భమున నా కామె దుర్గుణదురుద్దేశము లారోపింప వెనుదీయకుండెను ! అప్పులన్నియు విద్యాపరిపూర్తిఁజేసిన నేనును, నాపెద్ద తమ్ముఁడును మాత్రమే తీర్చివేసి, ఆస్తి యందఱమును సరిసమానముగఁ బంచుకొనుట న్యాయమని యామె తలంచెను. కుటుంబమరియాద నిలువఁబెట్టు విషయమున నాకుఁగల సద్భావ మామె సంశయించుటకు నేను మిగుల వగచితిని.

జనవరి 9 వ తేదీని మానాయనయు నేనును రాజమంద్రి నుండి బయలుదేఱి, రాత్రికి వేలివెన్నును, మఱునాఁటికి గోటేరును జేరితిమి. గోటేరులో ఋణదాత రామభద్రిరాజుగారు మాభూములు కొనుటకు మొదట సమ్మతింపకుండినను, మేము పట్టుపట్టినపిదప నద్దాని కొప్పుకొనెను. మేము తణుకులో నొకటిరెండురోజులు నిలిచియుంటిమి. నాపూర్వ సహపాఠి జనమంచి వెంకటరామయ్యగారచటి మాధ్యమికి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుఁడు. జనానా పత్రికకు వ్రాయుటకాయన సమ్మతించెను. మే మంత రేలంగి వెళ్లి బంధువులను జూచితిమి. పట్టపరీక్ష నిచ్చి, ఉద్యోగస్వీకారము చేసి, స్వగ్రామ సందర్శనముఁ జేయవచ్చిన నన్ను గ్రామస్థులు మిగుల మన్నించిరి. కుటుంబ కలహములవలన మాపెద్ద పెత్తండ్రి మొదట నాతో మాటాడకుండినను, పిమ్మట నా కెంతయో దయ చూపించెను. న న్నాయన ముద్దాడి, కంట నీరు దెచ్చుకొనెను. మే మంత బయలు దేఱి, రాజమంద్రి తిరిగి వచ్చితిమి.