పుట:2015.373190.Athma-Charitramu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. నూతనవత్సరము 253

యొక్కయు, ఇతర ప్రతిభావతులయొక్కయు ప్రతిమలు కొన్నికొని చట్టములు కట్టించి నాతోఁదెచ్చితిని. ఇంట వెలిగించుకొనుటకు కాంతిమంతములగు గాజుదీపములును, ముఖము చూచుకొనుటకు ముకురములును గొనివచ్చితిని. రాత్రు లీదీపముల వెలుఁగున గోడలకుఁ దగిలింపఁబడిన పటములు ప్రతిమలును తళతళ మని మెఱయుచు, గాంధర్వలోకదృశ్యములను సూచించుచుండెను. దేశీయమహాసభయందును, తదితర మహాసభలందును నే నాకర్ణించిన సురేంద్రనాథబెనర్జీ, మదనమోహనమాళవ్యా ప్రభృతులగు మహావక్తల ప్రసంగములు నా వీనుల నింకను వినుపించునట్లే యుండెను. ఎచటఁ జూచినను నా కనులకు సౌందర్యవాహిని గోచరించెను. పక్షుల కలస్వనములందును, మానినీమణుల మందహాసములందును, ప్రకృతికాంత వదనముకురమందును, నాకు సర్వేశ్వరుని సుందరాకారము ప్రతిబింబితమయ్యెను. ప్రాచ్యదైవభక్తుల హృదయసీమలందలి బహుదేవతా విశ్వాసమున కిట్టి దృశ్యములే హేతుభూతములై యుండవచ్చునని నేను దలపోసితిని.

పాఠశాల కింకను సెలవు లుండినందున మేము రాజమంద్రివెళ్లి బంధుమిత్రులను జూచితిమి. మృత్యుంజయరావున కిటీవల జ్వరమువలన బలహీనత యతిశయించినను, ఇపుడు కొంచెము నెమ్మదిగ నుండెను. మిత్రుల మిరువురమును భగవద్విషయములను గుఱించి ముచ్చటించుకొంటిమి. ఈమధ్య వ్యాధి ముదిరి, పరిస్థితులు తలక్రిందైనపుడు తన్నావరించిన నిబిడాంధకారము నొక్కింతఁ దొలఁగించి, తన యాత్మముం దొక విద్యుద్దీపము వెలిఁగెనని నామిత్రుఁడు పలికినపుడు, నే నది యీశ్వర సాక్షాత్కారమే యని గ్రహించితిని. అనుభవసిద్ధమగు నిట్టియీశ్వరసందర్శనమే మతమునకు ప్రధానాంగము కాని, సూత్రములు సిద్ధాంతములు గావని నాకు ద్యోతకమయ్యెను.