పుట:2015.373190.Athma-Charitramu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాన, అపుడు నాదినచర్యపుస్తకములలో నింగ్లీషున నేను లిఖించిన సంగతులు లిఖించినరీతినె నేను సామాన్యముగ నిందు తెలుఁగున వ్రాసితిని. నావ్యాసాదులలోని సంగతులు కొన్ని యిటఁ జేర్చితిని. నా కితరులు వ్రాసిన జాబులలోని విషయములు కొన్ని ప్రకటించితిని. నేను తెలుఁగున వ్రాసిన వ్యాసాదులు నే నాకాలమునఁ బ్రకటించిన నాపత్రికలలోను, ఇతరపత్రికలలోను, నాతెలుఁగు పుస్తకములలోను నున్నవిగాన, వానినంత విపులముగ నిచటఁదెలుపక, నాయింగ్లీషురచనముల ముఖ్యభాగముల యాంధ్రానువాదమె యిం దచ్చటచ్చట ముద్రించితిని.

నా విద్యార్థిదశనుగూర్చిన చరిత్రభాగము, పిమ్మట జరిగిన నా యెనిమిది సంవత్సరముల యుపాధ్యాయదశాకథాభాగ మంతటి దీర్ఘతను గాంచియుండుటయు, ఇటీవలి ముప్పదిసంవత్సరముల యుపన్యాసక దశాచరిత్రము కడు కుఱుచుగ నుండుటయు, చదువరుల కొకింత వింతగఁ దోఁపవచ్చును. దీనికిఁ గారణము లేకపోలేదు. మొదటి రెండుదశలందును నేను దినచర్యపుస్తకములు సరిగ నుంచుచువచ్చితిని, కళాశాలాదినములందలి నాదీర్ఘ దినచర్యపుస్తకములందలి వ్రాఁతలు, ఆకాలమందలి నాయధికభావోద్రేకమునకును, నిరోధ మెఱుఁగని నా చిత్తవృత్తులకును అద్దములవంటివె. ఉపన్యాసకదశయందలి నా దినచర్యపుస్తకములు వట్టితెల్ల కాగితపుఁబుటలనె ప్రదర్శించుచున్నవి. వృత్తి సంబంధమగు కార్యావళియె యాకాలమందలి నా దినచర్యయంతయు.

జీవితమందు నా కధికప్రేమాస్పదులయి, వివిధపరిస్థితులందు నాకుఁ జేదోడువాదోడుగనుండు నా యిరువురు తమ్ములకును చెల్లెలికినే కాక, తమయకాలమరణమున నాహృదయమును దు:ఖజలధిని ముంచివైచి దివికేగిన తక్కిన సోదరీసోదరులకును నే నీపుస్తకమును గృతి యొసంగి, కొంత మనశ్శాంతి నొందుచున్నాను.