పుట:2015.373190.Athma-Charitramu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. కష్టకాలము, శుభకార్యము 245

వేతనముగల మంచిఉద్యోగము దొరకిన మృత్యుంజయరావున కేమియు సౌఖ్యము లేదు. కఠినవ్యాధి వానిదేహమును బీల్చి పిప్పి చేయుచుండెను ! తోడిబోధకు లాతనిదెస నసూయాగ్రస్తులై యుండిరి. మా కుటుంబములో చిక్కులు మిక్కట మయ్యెను. తండ్రియు తమ్ముఁడు నెంత ప్రయత్నించినను మాచెల్లెలి కింకను వివాహసంబంధము కుదురలేదు. మేము రాజమంద్రిలో నిలిచిన యానాలుగుదినములలోనె మాయింటియం దత్తకోడండ్ర సామరస్యము వెల్లడి యగుచుండెను! ఈ కష్టపరంపర వీక్షింపలేక, నాయక్షులు సంక్షోభించెను.

అంత మేము 23 వ సెప్టెంబరున బెజవాడకు వెడలిపోయితిమి. కొన్ని దినములకుఁ బిమ్మట ననంతముగారు నాతో మాటాడుచు, తా మిటీవల క్లార్కుదొరతో సంభాషించితి మనియు, నేను గోరినచో డిసెంబరులో అమలాపురము వెడలిపోవచ్చు నని యాయన పలికి రనియుఁ జెప్పిరి ! బెజవాడ వీడుటకుమాత్రము నాకు మన సొప్పకుండెను.

అక్టోబరు 13, 14 వ తేదీలలో సతీపతులుభయులము బంధు సందర్శనార్థమై ఏలూరు వెళ్లియుంటిమి. అచటఁ గ్రొత్తగఁ గాపురమునకు వచ్చిన నామఱఁదలు శ్యామలాంబకు, ఆమెభర్తయగు వెంకటరత్నముతోను, ఆతని తల్లితోను మనస్పర్థలు ప్రబలుట విని, వారి గృహకల్లోలము లొకింత శమియింపఁబూనితిమి, ఇంట నంతఁగఁ బొత్తులేని మేమంతట యాయువదంపతులకుఁ జెలిమిచేకూరు సుద్దులు చెప్పి, బెజవాడకు మరలివచ్చితిమి.

ఒకనెల జీతము ముందుగఁ దీసికొని, మాచెల్లెలి వివాహమునకై యుభయులమును అక్టోబరు 20 వ తేదీని రాజమంద్రి పోయి