పుట:2015.373190.Athma-Charitramu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురుషులును, ఐన నొక్కొకప్పుడు నాబోటి సర్వసామాన్యుని చరిత్రముకూడ సంసారయాత్ర గడపుటయందు కొందఱికి సాహాయ్యకారి కావచ్చుననియె నాయాశయము.

ఈపుస్తకరచనాసందర్భమునుగూర్చియు, దీని యాధారములను గుఱించియు నొకింత చెప్పెదను. నేను 1888 వ సంవత్సరమధ్యము నుండి 1902 వ సంవత్సరారంభమువఱకును విడువకుండఁగను, పిమ్మట చాలకాల మప్పుడప్పుడును, దినచర్యపుస్తకములు వ్రాయుచు వచ్చితిని. ఆకాలమందలి నాయాశయాలోచనములు, నే జదివిన పుస్తకములలోనివిషయములు, చేసినపనులు మున్నగునవి యందు వర్ణింపఁబడియున్నవి. వీనికిఁ దోడుగ 1891 వ సంవత్సరము జూలైనుండి యేడెనిమిది సంవత్సరములు "సత్యసంవర్ధని"ని, 1894 వ జులై నుండి 1906 వఱకు "తెలుగు జనానాపత్రిక"ను బ్రచురించితిని. ఆకాలమందును, పిమ్మటను కొన్ని తెలుఁగుపుస్తకములు రచియించితిని. వీనియన్నిటిప్రతులును, నే నితరపత్రికలకు వ్రాసిన వ్యాసాదులు, చేసిన యుపన్యాసములును నాముందటఁ గలవు. ఇవిగాక, నే నుంచుచువచ్చిన యింటిలెక్కలపుస్తకములు, నాకు వచ్చిన యుత్తరములు మొదలగు ప్రాఁతకాగితములును చాల గలవు. ఇవి యన్నియు నాజ్ఞాపకశక్తి కాధారముగఁ జేసికొని, 1930 వ సంవత్సరాంతమున "శ్రీ వీరేశలింగ సంస్మృతి"ని రచించితిని. వీనిసాయముననే 1931 వ సం. అక్టోబరులో నా "ఆత్మచరిత్ర" ప్రథమభాగమును వ్రాసి, నా సోదరీసోదరుల కది చూపించి, తక్కినభాగములు వెనువెంటనే లిఖించితిని.

ఈగ్రంథరచనాపద్ధతిని గుఱించి యొకింత ప్రస్తావించెదను. పూర్వకాలమున పరిస్థితు లెట్లు నామనసునకుఁ దట్టెనో, ఆకాలమున నా యూహాప్రపంచ మెటు లుండెనో చదువరులు గ్రహింపఁగోరెదరు