పుట:2015.373190.Athma-Charitramu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 238

విషయమున జాగరూకత యత్యావశ్యమని మెల్లగ సూచించిరి. కాని నాకది బాగుగ నచ్చకపోవుటచేతనో, నాయవసరము లసంఖ్యాకము లగుటచేతనో, నాయప్పులకు తెంపు లేకుండెను ! ఆగష్టునెల చివర నొకనాఁడు నే నాయనను సొమ్మడుగఁగా, అది యొసంగుచు, యువకులు అప్పులపాలు గాకుండుట కర్తవ్యమని నను వారు హెచ్చరించిరి. ఆయన వాక్కులు నాహృదయమునం దీమాఱు సూటిగ నాటెను ! ఇంకఁ బలుమా ఱీయప్పులు చేయకుందు నని నామనస్సును దిట్టపఱుచుకొంటిని. అప్పుడును, పిమ్మట పెక్కువత్సరముల వఱకును, నా ఋణబాధ శమింపకుండినను, చిట్టి యప్పులకై చీటికి మాటికి చెలికాండ్ర చెంత చేయిచాచు నలవాటు చాలించుకొంటిని !

అనంతము గారి స్నేహము మఱికొన్ని సందర్భములందును నాకు లాభకారి యయ్యెను. ఆయనకు ప్రథమకళత్రమువలన రామచంద్రరావు, ఆనందరావు నను పుత్రులు గలరు. వీ రపుడు మా పాఠశాలావిద్యార్థులు. భార్యమరణానంతరమున అనంతముగారు చెన్న పురియందలి యొకగౌరవక్రైస్తవ కుటుంబములోని సౌభాగ్యవతి యను పడతిని బరిణయమయిరి. సౌభాగ్యవతి తనసుందరాకారమున కెనయగు సుగుణసంపత్తిని దాల్చియుండెను. విద్యావంతుఁడును, అకుంఠిత దైవభక్తిపరుఁడును నగు భర్తయం దీమెకు భక్తిగౌరవములు మెండు. సవతికుమారులయం దీసతి యమితపుత్రవత్సలతఁ గాంచియుండెను. నాయం దీసుదతికి సోదరభావము గలదు. నాభార్య కీమెతోఁ బరిచయము గలిగినప్పటినుండియు, పలుమారీయునిదలిరువురును గలసికొని, యొకరి కష్టసుఖము లొకరు చెప్పుకొనుచు వచ్చిరి. సతివిద్యాభ్యున్నతి విషయమై సంతత పరిశ్రమముఁ జేయుచు, అపరిమితమగు నలజడి పాలగుచునుండెడి