పుట:2015.373190.Athma-Charitramu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. ధన్వాడ దంపతులు 237

టచేత, హిందువులు క్రైస్తవులును వారియందు సమానగౌరవమును గలిగియుండిరి. ఇదివఱకు వారు క్రైస్తవమతబోధకులలో నాయకులుగనుండి, ఆ మత సంఘము వారి కోరిక చొప్పున నిటీవల బెజవాడ పాఠశాలాధ్యక్షతను వహించిరి. జ్ఞాన సంపన్నులును, అనుభవశాలురును నగు వారు, నాకిపుడు పాఠశాలలో పైయధికారు లగుటయే కాక, లోకజ్ఞానసంపాదన విషయమున గురుప్రాయులు కూడనయిరి. అనుదినమును పురవీథులయందు నడచిపోవునపుడు, కనఁబడిన పరిచితుల యోగక్షేమ మారయుచు, వారి కష్టసుఖములు తెలిసికొనుచును, అనంతముగారు లోకబాంధవు లనిపించుకొనిరి. నూతన ప్రదేశమునఁ గ్రొత్తకాపుర మేర్పఱుచుకొనిన యువదంపతుల మగు మా సేమము పలుమారు వారు గనిపెట్టుచు, ప్రేమాస్పదులగు జనకునివలె మాకు సదాలోచనములు చెప్పుచునుండువారు. శాస్త్రజ్ఞాన లాభమందినను అనుభవమునఁ గొఱవడిన నా కా బాల్య దినములలో, వారి హితబోధనమును, ముఖ్యముగ వారి పవిత్ర జీవితమును, సత్పథగమనమున నమితముగ సహకారు లయ్యెను.

ప్రథమ దినములలో నాకుఁ బలుమారు, ధనసాహాయ్యము కావలసివచ్చెను. క్రొత్తకాపుర మనఁగనే ధనవ్యయ మధికము. దీనికిఁదోడుగ, రాజమంద్రి యందలి కుటుంబ వ్యయమునకును, తమ్ముల విద్యాపరిపోషణమునకును, నేను నెలనెలయును సొమ్ము పంపవలసివచ్చుచుండెడిది. చదువు వార్తా పత్రికలకును, కొను పుస్తకములకును, తఱచుగ డబ్బు కావలసివచ్చెడిది. అట్టి యక్కఱలకెల్ల, అనంతముగారు, నా జీతములోనుండి సొమ్ము ముందుగ నిచ్చుచుండెడివారు. నే నిట్టి యప్పులకు తఱచుగ వారియొద్దకుఁ బరుగులిడుచు, ఆచిరకాలముననే వారిని విసింగించితిని ! ఒకటిరెండు మాఱులు అనంతముగారు నాకు ధన