పుట:2015.373190.Athma-Charitramu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. అమలాపురోద్యోగము 235

మచిలీపట్టణము వ్రాయఁగా, దానికిఁ దన యామోదమును క్లార్కుదొర నాకు వెంటనే తెలియఁబఱచెను.

నే నిపుడు బెజవాడలో నుండుటకే స్థిరపఱుచుకొని, మంచములు మున్నగు సామానులు కొంటిని. ఇదివఱకే "జనానాపత్రికా"ధి పత్యమును బూనితిని. ఆపత్రిక చందాదారులకు నాపే రెఱుక పడువఱకు నొక సంవత్సరము పత్రికమీఁద నాపేరుతోఁ బాటు వెంకటరత్నముగారి నామమును బ్రకటింపఁబడెను. కాని, వ్యాసాదులన్నియు నేనే వ్రాసి పంపుచుంటిని. ఇట్లు "సత్యసంవర్థని"ని వదలి వైచిన నాచేతు లొకమాసమైన నూరకుండక, నూతన పత్రికయగు "జనానాపత్రికా" వ్యాసరచనమునఁ దగిలియుండెను !

బెజవాడలోని మా వేఱింటికాపురపుఁ దొలిదినములను గూర్చి యొకింత ప్రస్తావింపవలెను. ఆనాఁటి నా దినచర్య పుస్తకములు పరికింప నా కాశ్చర్యము పొడముచున్నది. నా కప్పు డిఱువదిమూఁడేండ్ల వయస్సు. భార్యకుఁ బదునాఱు వత్సరములు. యువవిద్యాధికుఁడగు పతి బజారుపనులు మున్నగు నిత్యకృత్యములు నిర్వర్తించుట కంటె, విద్యాగంధము లేక బాల్యావస్థ దాటియుదాటని సతియే తనగృహకృత్యములు బాగుగఁ జక్కబెట్టుకొనఁగలిగెను ! ఇంట వంటకముల రుచి కేమాత్రము భంగము వాటిల్లి నను నేను భార్యమీఁద మండిపడుచుందునే కాని, నే దెచ్చిన పుచ్చు పెసలకును, పచ్చి కట్టెలకును, ఆమె యించుక విసిగికొనిన సహించువాఁడను గాను ! ఇంతియ కాదు. భర్తశాసనము చొప్పున ననుదినమును భార్య పాఠముఁ జదివి, వ్రాఁత వ్రాసి, ఆయన బోధనమును జెవియొగ్గి వినుచుండవలయునే కాని, తనవిధులు నెరవేర్చుటయం దావంతయు ప్రాలుమాలికఁ జూపరాదు. స్త్రీవిద్యాభిమానియగు పెనిమిటి స్త్రీస్వాతంత్ర్య మభిల