పుట:2015.373190.Athma-Charitramu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. అమలాపురోద్యోగము 233

ఒక ధనవ్యయ విషయముననే గాక, మఱికొన్ని సంగతులందును దంపతుల కభిప్రాయభేద మేర్పడెను. నే ననుదినమును సాయంకాలమున కాలువయొడ్డున షికారు పోవుచుండు నప్పుడు, నాతోఁగూడ రమ్మని సతి నాహ్వానించుచుండువాఁడను. ఆమె యట్లు చేయనొల్ల కుండెడిది. పదునాఁఱేండ్ల బాల పతితోఁ గలసి వాహ్యాళి కేగుట, ఆకాలముననే కాదు, ప్రకృతమందును, సాహసకృత్య మని హిందూ సంఘ మెంచుచున్నది ! చెన్న పురివంటి మహాపట్టణములలో హిందూ యువిదల కిట్టి స్వేచ్ఛావర్తనమున కవకాశము గలుగును గాని, బెజవాడవంటి చిన్న పట్టణములలో నిట్టి చర్య లిరుగుపొరుగుల యమ్మలక్కల వికట వ్యాఖ్యానములకుఁ దావలమగుచుండును ! ఇట్టిపనులవలన తరుణవయస్కులగు నబలలకు తోడి కులకాంతలలోఁ దలవంపులు గలుగుచుండును.

6. అమలాపురోద్యోగము

నా "బెజవాడ - అమలాపురముల" యుద్యోగములకుఁ జాల కాలమువఱకు ద్వంద్వయుద్ధము సాగెను ! వేసవిపిమ్మట నేను బెజవాడపాఠశాలఁ జేరిన కొలఁదిదినములకు, అమలాపురపుఁ బని తప్పక యిచ్చెద రని మాతమ్ముఁడు రాజమంద్రినుండి నాకు వ్రాసెను. 17 వ జూలై తేదీని అమలాపురము పాఠశాలాప్రథమోపాధ్యాయుఁడు నాకుఁ దమపాఠశాలలో ద్వితీయోపాధ్యాయపదవి నిచ్చి రని వ్రాసి, నే నది స్వీకరింతునా యని యడిగెను. అందువలన మరల నామనస్సున కలజడి గలిగి, నాఁడే మాప్రథమాధ్యాపకుని యొద్దకుఁ భోయి, యీసంగతి యాయన కెఱిఁగించితిని. ఆయన దిగులుపడి, క్రొత్తపనిఁ గైకొనవలదని సలహానిచ్చెను. కొలఁది దినములలో