పుట:2015.373190.Athma-Charitramu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము.

గ్రంథకర్త యేపుస్తకము వ్రాసినను, అది యాతని యాత్మ, చరిత్రమె యగునని యొక సుప్రసిద్ధ రచయిత నుడివెను. మనరచనములు అద్దములవలె మనయభిప్రాయములను ప్రతిఫలనము చేయుచుండును. మన కొంకిగీఁత లెల్ల మన జీవితకథనే గీయుచున్నను, ఎంతజాగ్రత్తతోఁ జిత్రించిన జీవితచిత్రములందును, కొంకరగీఁతలు గానిపించుచునే యుండును ! ఇతర రచనములందుకంటె నాత్మకథా సంవిధానమున భ్రమప్రమాదముల తాఁకు డధికముగఁ గానవచ్చును. పరులరూపమును జిత్రించుపట్ల నెంతో నిపుణతచూపు మనవ్రేళ్లు, సొంత ప్రతిమను గీయునపుడు వణఁకజొచ్చును ! అహంభావము, పక్షపాతబుద్ధి మున్నగు దుర్ల క్షణములు మనల నావేశించి, సత్యపథమునుండి యొక్కొకసారి మనపాదములను పెడదారులఁ బట్టించు చుండును. ఐనను, రోటిలోఁదల దూర్చినవాఁడు రోఁకటిపోటులకు వెఱచునా ? తన జీవితకథను ధారాళముగ వినిపింపసాహసించిన కథకునికి, చిన్నకల్లలచేఁ దన నెరసులు కప్పి పుచ్చ నెంచుట సిగ్గులచేటుగదా !

సత్యప్రకటనమె ముఖ్యావధిగఁ జేకొనిననేను, కీర్తిధనాదుల మీఁదఁ గన్నువేసి, యీ పుస్తకరచనమునకుఁ బూనుకొనలేదు. ఇదివఱలో నాత్మచరిత్రము నాంధ్రమునఁ బ్రుచురించిన ముద్గురు వర్యులగు కీ. శే. కందుకూరి వీరేశలింగముపంతులుగారి "స్వీయచరిత్రము"ను, గాంధీమహాత్ముని "ఆత్మకథ"ను మించనెంచి నే నీపుస్తకమును వ్రాయలేదు. ఆగ్రంథకర్తలు మహామహులు, నాదర్శ,