పుట:2015.373190.Athma-Charitramu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 226

నామనస్సు నిప్పుడు కలఁచెడి విషయములు కొన్ని కలవు. పెద్దచెల్లెలు కనకమ్మ వివాహసంబంధనిశ్చయ మింకను గాలేదు. కొన్ని సంబంధములు వచ్చినవి. మా తండ్రియు తమ్ముఁడును వీనిని గుఱించి మిక్కిలి తిరిగిరి. ఏదో యొక సంబంధము శీఘ్రమే నిర్ణయింపవలెనని నాకోరిక. మాతల్లి తనపెద్దకోడలిమీఁద నాగ్రహపడి, ఆకోపము నామీఁదఁ జూపసాగెను ! నాకిది యాశ్చర్యవిషాదములు గొలిపెను. ఇపుడు మాయింటితీరు నాకు బాగుగఁ గనఁబడలేదు. చిన్న పిల్లలు తలిదండ్రుల యెడఁ దగిన గౌరవములేక, వారిని బరిహసించుచు, సత్యదీక్షలేక నవ్వుటాలతోఁ బ్రొద్దుపుచ్చుచుండిరి! వారికి నాభార్యకు నిపుడు మనసు గలియక, ఉభయులు చిన్న చిన్న కయ్యములకుఁ గాలుద్రవ్వుచుండిరి !

అప్పుడప్పుడు నేను మిత్రుఁడు రంగనాయకులునాయఁడు గారినిఁ గలసికొనుచువచ్చితిని. తన భావికార్య ప్రణాళికను గుఱించి యాయన చెప్పుచుండువాఁడు. తాను ఉద్యోగమునుండి విశ్రాంతిఁ గొనినపిదప, రాజమంద్రిలో స్వకీయవైద్యాలయ మొకటి స్థాపింతు ననియు, అచట మందులిచ్చుటకై తన పెద్దకొడుకున కీలోపుగ మూలి కాజ్ఞానమును సమకూర్చు చదువు చెప్పింతు ననియు నాయన యనుచుండువాఁడు. ఇపుడు జబ్బుపడిన నాభార్యకు, చెల్లెండ్రకును నాయఁడుగారు మంచిమందు లిప్పించిరి.

ఈ సమయమున నాకు నాబావమఱఁది వెలిచేటి వెంకటరత్నముగారితో స్నేహము పెంపొందెను. ఆయన క్రమక్రమముగ ప్రార్థన సమాజముపట్లను, సంఘసంస్కరణ విషయములందును, సుముఖత్వముఁ జూపుచు నాకు సాయపడుచువచ్చెను.