పుట:2015.373190.Athma-Charitramu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 222

వత్సరము లీ పాఠశాలలో నుందునని వాగ్దానము చేసినఁగాని నా కిప్పటి జీత మీయఁజాల నని యాయన చెప్పివేసెను ! దీనికి నేను సమ్మతింపలేదు. నాతో క్లార్కుదొర జరిపెడిబేరములు విని మిత్రులు నవ్వసాగిరి. ఇతరోద్యోగ మేమియు సమకూర్చుకొనక, చేతనున్న పని వదలివేయఁగూడదు గదా. ఐనను, 10 వ ఏప్రిలు తేదీని నేను కోపమున క్లార్కుదొరకుఁ బంప నొకయుత్తరము లిఖించితిని. కాని, అనంతముగారి సదాలోచనము ననుసరించి, యది సవరించి, మఱి పంపితిని. ఇప్పటి జీత మీయనిచో నే నిచట నుండఁ జాల నని చెప్పివేసితిని.

అనంతముగా రొకనాఁడు నాతో మాటాడుచు, మావలెనే మా యాఁడువాండ్రును అపుడపుడు సమావేశమై సంభాషించుకొను చుండుట శ్రేయోదాయకమని సూచింపఁగా నే నందుల కంగీకరించితిని. 21 వ ఏప్రిలుతేదీని మే మిరువురమును అనంతముగారి గృహమును సందర్శించితిమి. ఆదంపతులు మాకు సుస్వాగత మొసంగి ఫలహారము లిడిరి. నే నొకింత భుజించినను, తన కుపాహారములు సరిపడవని నాభార్య చెప్పివేసి వానినిఁ గైకొనలేదు.

ఆదినములలో నొకప్రొద్దున దేవసహాయముగారు, యతిరాజులుపిళ్ళగారి తమ్ముఁడు, మఱి యిద్దఱు మువ్వురు స్నేహితులును వెంట రాఁగా, నేను కృష్ణదాటి, ఉండవల్లిపోయి, యచటఁ గల గుహలను వీక్షించితిని. మేడయంతస్తుల వలె కొండఁదొలిచి నిర్మాణముఁ జేసిన యాగుహలను జూచి మే మాశ్చర్య మందితిమి. అనంతశయనుఁడగు విష్ణుని విగ్రహము మా కచటఁ గానఁబడెను. పూర్వ మక్కడ ఋషి సత్తములు సమావేశమై, యీశ్వరధ్యాననిమగ్ను లగుచుండి రని మే మనుకొంటిమి. మిగుల దయతో మాకు పిళ్ల గారు కాఫీ, రొట్టె