పుట:2015.373190.Athma-Charitramu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. ప్రార్థనసమాజము 221

మానవశాసనోల్లంఘనముమాత్రమే గాక, పరమాత్ముని పవిత్రాజ్ఞా తిరస్కరణముకూడను. అఘోరవిపత్తునుండి మనుష్యుని రక్షించునదియే మతము. ఈశ్వరసాక్షాత్కారము వడయుటకు సాధనములు భక్తిధ్యానానుతాపములు, సత్కర్మవిచయమును. ఈ సాధనకలాపమున ప్రజ్ఞాశక్తులందు పెనుపొంది, జీవాత్మ పరమాత్మనుఁ జేరఁగలదు.

"తక్కిన మతములకు వలెనే ఆస్తికమతయాథార్థ్యమునకును సాక్ష్యము లేకపోలేదు. ఈ మతధర్మములచొప్పున జీవితయాత్ర జరుపుకొని ధన్యులైన యుత్తమజనులచరితములె దీనికి గొప్పసాక్షులు. రామమోహనరాయలు, దేవేంద్రనాథకేశవచంద్రులును, భరతఖండమున నిటీవల నీ మతప్రచారము సలిపి చరితార్థత నొందిన మహామహులు. ఈ సమాజసభ్యులగు మేము వారితో సరిపోల్పఁదగినవారము గాక, మా యాశయముల కుచితమగు నున్నతపదవినైన నందకున్న యల్పుల మైనను, స్వయంకృషిచే దినదినాభివృద్ధి నొందఁగోరుచున్న వారము. అజ్ఞానతిమిరమునుండియు, పాపకూపమునుండియు దైవానుగ్రహమున మే మొకింత తప్పించుకొని, సత్పథగాములమై సాగిపోవ నుద్యమించి యున్నారము."

ఆమఱునాఁడు ప్రార్థనసమాజమువారు బీదల కన్నదానముఁ జేసిరి. సాయంకాలము వీరేశలింగముపంతులుగారు "జీవితముయొక్క పరమార్థము, దానిని పొందు మార్గము" అను విషయమున నొక దీర్ఘోపన్యాసముఁ జేసిరి. మఱుసటిదినమున నేను బెజవాడ వెళ్లి, పాఠశాలలోని పనులు నెఱవేర్చుకొంటిని.

అప్పటికిఁ గొన్ని దినములకు వెనుకనే నాకు క్లార్కుదొరనుండి ప్రత్యుత్తరము వచ్చెను. యల్. టి. పరీక్షనిచ్చినపిమ్మట రెండు