పుట:2015.373190.Athma-Charitramu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. బెజవాడ 217

గారు నాకుఁ బరిచయము గలిగించిరి. మఱునాఁడు మా తండ్రి రాజమంద్రినుండి నా భార్యను, తమ్ముఁడు సూర్యనారాయణను బెజవాడకుఁ గొనివచ్చెను. మేము తాత్కాలికముగ నొక స్నేహితునియింట విడిసితిమి. పాఠశాల కొంతదూరమైనను, బకింగుహాము పేట వాస యోగ్య మగుటచేత, మే మచటనే యుండ నిశ్చయించితిమి. కాలువవంతెనకుఁ జేరువనుండు గోవిందరాజులవారియింటిలో నొకభాగమును మా తండ్రిగారు మాకుఁ గుదిర్చిరి. చదువుకొనుటకే సూర్యనారాయణ యిచటికి వచ్చినను, మా తల్లిని విడువనొల్లక, మూఁడునాలుగుదినములలో పయనమైన మాజనకునివెంటఁబడి యాపసివాఁడు రాజమంద్రి వెడలిపోయెను! మా క్రొత్తకాపురమునకు వలయు వస్తుసముదాయమును బజారునుండి కొనితెచ్చియిచ్చి, మా తండ్రి మమ్ము విడిచివెళ్లెను. అనంతముగారియొక్కయు, ద్వితీయోపాధ్యాయులగు దేవసహాయముగారియొక్కయు సాయమువలన, కూర్చుండుటకు కుర్చీలు బల్లలు మున్నగు సామాను నేను కొని, నూతనపురనివాసమున కాయత్తమైతిని.

కాని, జీవితమున నన్ను గాసిఁబెట్టుటయే వినోదముగఁ గైకొనిన వికటవిధి నా కిపుడైన మనశ్శాంతి లేకుండఁజేసెను! నూతన ప్రదేశమునఁ గ్రొత్తకాపుర మారంభించిన నా కాశాభంగ మొనరించెడి యుదంత మొకటి యంతట సంభవించెను. బెజవాడ పాఠశాలాధి కారియు, బందరు నోబిలుకళాశాలాధ్యక్షుఁడును, నా యుద్యోగ ప్రదాతయునగు రెవరెండుక్లార్కుదొర నాకొకలేఖ నిపుడు వ్రాసెను. నేను యల్. టి. పరీక్షలో పూర్తిగ విజయమందనిహేతువున నామూలమునఁ దమవిద్యాలయమునకు దొరతనమువారినుండి యాదాయ మేమియు రాదు గావున, తా నిదివఱ కేర్పఱచినట్టుగ డెబ్బదిరూపా