పుట:2015.373190.Athma-Charitramu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 210

నటుఁడు, పాత్రానురూపమగు నభినయము చేయకతీఱునా ? బ్రదుకు తెఱవెఱిఁగిన నాసహపాఠులలోఁ బలువురు, బోధనసమయమున లేని వికాసమును చుఱుకుఁదనమును దెచ్చుకొని, మృదుమందహాసములతో బోధనకార్యము నెఱపి, కృతకృత్యు లగుచువచ్చిరి. ఇట్టి కపటనటన మయోగ్యమని యెంచిన నేను, నాబోధనమును తగినంత సొగసుగను సారవంతముగను జేయ ప్రజ్ఞానుభవములును, కనీసము వాంచాబలమైనను లేక, బోధనకార్యమం దపజయము గాంచుచుంటిని ! ఈకారణముననే, అదివఱ కే పరీక్షలోఁగాని పరాజయ మెఱుంగని నేను, యల్. టీ. పరీక్షలోని బోధనభాగమున పిమ్మట ముమ్మాఱు తప్పి, వృత్తిలో నాకుఁ జేకూరెడి లాభమును జాలభాగము గోలుపోయితిని !

50. పత్రికాయౌవనము

ద్వితీయసంవత్సరప్రారంభముననే సత్యసంవర్థనికి యౌవన దశాసంప్రాప్త మయ్యెను. దీని కొకచిహ్నముగ, రెండవసంపుటము నుండియు మాపత్రిక, ముప్పదిరెండుపుటలు రంగుకాగితపు ముఖపత్రమునుగల రమ్యపుస్తకరూపమున విలసిల్లెను. బాహ్యవేషముతోనే పత్రికమిసమిసలు తుదముట్టలేదు. నా యాంగ్ల వ్యాసములందును, కనకరాజునియాంధ్రరచనములందును, చక్కని యభివృద్ధి గాన వచ్చెను. 1892 సంవత్సరము జూలైనెలసంచికలో నే నాంగ్లమున వ్రాసిన "మానవజీవితమందలి త్రివిధశోధనముల"లోనె పత్రికయౌవనపుఁబోకడలు గనఁబడెను. అప్పటినుండియు నా సత్యసంవర్థనీ వ్యాసములు వెనుకటివానివలె మొండిముక్కలు గాక, నిడుదలై, భావవిస్ఫురణ వాక్యసౌష్ఠవములతో విరాజిల్లుచుండెను. ఆ సెప్టెంబరుసంచికలోని నా "అనుష్ఠానికధర్మము"నం దీసంగతి విస్పష్ట