పుట:2015.373190.Athma-Charitramu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 196

త్నింతు ననెను. పాపయ్యగారితోను, నాపూర్వగురువులగు వెంకటప్పయ్యగారితోను, పాఠశాలనుగూర్చి ప్రస్తావింపఁగాఁ, ఆమోదము చూపి సహాయము చేసెద మనిరి.

మే మిట్లు రాజమంద్రిలో "ఆస్తికపాఠశాలా" స్థాపనమును గూర్చిన ప్రయత్నములమీఁద నుండఁగా, ఆ విద్యాలయమును గుఱించి మేము ఔదాసీన్యము వహించియుంటిమని మృత్యుంజయరావు మామీఁద నుత్తరములు గుఱిపించుచుండెను !

మా కుటుంబమునకై మే మిదివఱకు వేఱువేఱుచోట్ల చేసిన యప్పులన్నియుఁ దీర్చివైచుటకై, ఇపుడు గోటేటి రామభద్రిరాజుగారియొద్ద పెద్దఋణము తీసికొని, ఆయనకు మాతండ్రియు నేనును గలసి పత్రము వ్రాసియిచ్చితిమి. ఆసందర్భమున వివిధప్రదేశముల నుండుబంధువులు జూచి వచ్చితిని.

కొంతకాలమునుండి "వివేకవర్థని" ప్రచురింపఁబడుచుండుట లేదు. వీరేశలింగముగారు దాని నిపుడు పునరుద్ధరింప నెంచి, తాను దొరతనమువారికొలువున నుండుటచేత, ఆపత్రిక కొకసంపాదకుని గుదుర్చుట కాలోచించుచుండిరి. నేనిపుడు పట్టపరీక్షలోఁ దేఱి, పత్రికాసంపాదకత్వమునఁ గొంత యనుభవము సమకూర్చుకొనుటచేత వారికన్ను నామీదఁ బడెను. ఈగౌరవమునకు హర్ష మందినను, పత్రికాధిపత్యమునకు నేను సమ్మతింపలేదు. సైదాపేటలో విద్యార్థిగ నుండు నేను రాజమంద్రిలోని వారపత్రికకు సంపాదకుఁడనగుట సమంజసమా యని నాప్రశ్నము. నామకార్థము నేను పత్రికాధిపతి నైనచో, రాజమంద్రిలో తానే పని నంతయుఁ జక్క పెట్టుదు నని పంతులసమాధానము. నూతనపత్రికను తమప్రహసనములతో నింపివేసి, పంతులు నన్నుఁగూడ నభియోగములపాలు చేయు నని నాభయము.