పుట:2015.373190.Athma-Charitramu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 194

హ్మణ్యయ్యరుగారు, బుచ్చయ్యపంతులుగారిసిఫారసుమీఁద, బోధనాభ్యసనానంతరమున మిత్రుని నన్నుఁ దమవిద్యాలయమున బోధకులగ నియమింతుమని వాగ్దానము చేసిరి. కొలఁదిదినములకే మాపట్టపరీక్షాఫలితములు తెలిసెను. గణితశాస్త్రమునందు జయ మందుటచేత మృత్యుంజయరావును, మూఁడుభాగములందు నొకమాఱె యుత్తీర్ణ మగుటచేత నేనును, పట్టపరీక్షఁ బూర్తి చేసితిమి. కావున మేము బోధనాభ్యసన కళాశాలలో నుండుట నిశ్చయ మయ్యెను.

పైని చెప్పిన నిత్యకర్మానుష్ఠానమున మునిఁగి మిత్రుఁడు నేనును మేయి 10 వ తేదీవఱకును సైదాపేటలో నుంటిమి. మాకుఁ బ్రియమగు భావికాలమునందలి "ఆస్తికపాఠశాల"నుగుఱించి మే మిరువురము మాటాడుకొనుచుందుము. ఆవిద్యాలయము నెలకొల్పుట సాధ్యమని యొకమాఱును కా దని యొకమఱును మాకుఁ దోఁచుచుండెను. పాఠశాలాస్థాపనము నిజమైనచో, రాజమంద్రిలో ముందు మేము సమాజవిధులు, పత్రికపనులు నెట్లు జరుపుదుమా యని యాలోచించు కొనుచుందుము.

మృత్యుంజయరావు స్మేహపాత్రుఁడె. కాని, యతఁ డొక్కొకసారి యమితమితభాషిత్వ మూని, తన మనస్సునందలి సందియములను సహచరుఁడను సహాధ్యాయుఁడను నగు నాతో ధారాళముగఁ జెప్పకుండెడివాఁడు. పరదేశమున నొకరికష్టసుఖముల కొకరు కావలసిన మా కిరువురకు నందువలనఁ దగినంత సౌహార్దమేర్పడక, మీఁదు మిక్కిలి యరమరలు జనించెను. తక్కిన మిత్రులైనను, మాపొరపాటులను సవరించి, మాకుఁ బొత్తు గలిగింపనేరకుండిరి.

సైదాపేట మద్రాసునకంటె నెక్కువ యారోగ్యప్రదమైనది. ఆకాలమున బోధనాభ్యసన కళాశాలచెంతనే "వ్యవసాయకళాశాల"