పుట:2015.373190.Athma-Charitramu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 192

ఇవ్విథమున ముందలి సాధకబాధకములు బాగుగ నాలోచించుకొనక, పట్టపరీక్షాఫలితములు తెలియకమున్నె, వేవేగముగ నేను బోధానాభ్యసనకళాశాలకుఁ బరుగిడితిని !

45. సైదాపేట

1893 వ సంవత్సరము ఫిబ్రవరి 1 వ తేదీని సైదాపేట బోధనాభ్యసనకళాశాలలో మృత్యుంజయరావు నేనును జేరితిమి. ఆ విద్యాలయములో జ్ఞానకాండమునకంటె కర్మకాండమునకే ప్రాముఖ్య మీయఁబడుచుండెను. ఒక్కొక్కప్పుడు, జ్ఞానసంపాదనమున కచట బొత్తిగ నవకాశము గలిగెడిదియెకాదు ! అచ్చటి నిరంతరకర్మకలాపము విద్యార్థులను వట్టి కీలుబొమ్మలగఁ జేయుచుండెను ! వేకువనె డ్రిల్లు, పిమ్మట డ్రాయింగు. ఈరెండును పూర్తియగునప్పటికి తొమ్మిదిగంటలు. పదిమొదలు నాలుగు నాలుగున్నరవఱకును బడి. పిమ్మట కసరతుగాని, సభగాని, సాయంత్రమువఱకును. మొత్తముమీఁద విద్యార్థి చదువుకొనుట కేమియు వ్యవధి లేకుండెడిది. కసరతు అయినను, శరీరమున కేమియు వ్యాయామ మొసంగని వట్టి డ్రిల్లు. ఇందు సరిగా కీలుబొమ్మలవలెనే సాధకులు వికృతాంగ వైఖరులతో నటునిటుఁ దిరుగుచు కాలక్షేపము చేయుదురు !

ఒకపూట ఉపాధ్యాయులు మాకు బోధింతురు. ఈబదులు తీర్చివేయుటకా యనునట్టుగ మే మింకొకపూట మావిద్యార్థులకు బోధింతుము ! కళాశాలనుండి మేము గ్రహించినది విద్యావిశేషమేమియు నందు లేదనియె ! ఇచటి బోధనాప్రభావ మింతటితో నిలువక, జ్ఞానబోధకపుస్తకములు మేము చదువ నవకాశముకూడ లేకుండఁ జేసెను ! సహాయాధ్యక్షుఁడగు డెన్హాముదొర ప్రవీణుఁడు. ఆయన