పుట:2015.373190.Athma-Charitramu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాత్రకు పరమార్థము. ఆచారావరణబద్ధమైన జీవయాత్రను ఆత్మావరణమునందు విశాలము చేయగల విధము నాత్మచరిత్రము బోధించుచున్నది. జీవ మాచారావరణము నతిక్రమించి ఆత్మావరణమునందు విహరించుట కభ్యాసయోగము సాధనముగనున్నది. సంసారమునందును, వృత్తివిధానమునందును, సంఘజీవనమునందును, సాహిత్యోపాసనమునందును, దైవారాధనమునందును ఆత్మోపలబ్ధిని బడయుటకు వేంకటశివుడుగారు చేసిన పరిశ్రమను ఆత్మచరిత్రము తెలుపుచున్నది.

వేంకటశివుడుగారు సంసారయాత్రను సరళముగా 63 ఏండ్లు చేసిరి; విద్యావృత్తియందు జీవితమును సౌమ్యముగ గడపిరి; సంఘసంస్కారమునకై విద్యా వివేకములను వినియోగించిరి. సత్యసంవర్ధనీ జనానాపత్రికలను నిర్వహించియును, పత్రికలకు వ్యాసములను వ్రాసియును, హిందూసుందరీమణులు, చిత్రకథామంజరి, మొదలగు గ్రంథములను రచియించియును సాహిత్యోపాసనమును జేసిరి; నియతముగ దైవసంపదల యారాధనము, ఆసక్తిమతారాధనమును జేసిరి. జీవయాత్రయం దాత్మానాత్మల సంరంభమునం దాత్మోద్ధరణమునకై చేసిన ప్రయత్నముల నాత్మచరిత్రము సుగమము చేయుచున్నది.